Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుహు కుహూ రాగాల "బర్డ్ మేన్" సలీం అలీ

Advertiesment
బాలప్రపంచం
ప్రముఖ భారత పక్షి శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ సభ్యుడు అయిన డాక్టర్ సలీం అలీ "బర్డ్ మేన్ ఆఫ్ ఇండియా"గా పేరొందిన అనితరసాధ్యుడు. భారతదేశంలో పక్షి శాస్త్రం గురించిన అవగాహన, అధ్యయనం పెంపొందించేందుకుగానూ విశేషమైన కృషి సల్పి భారతీయుల నీరాజనాలందుకున్న అలీ, కన్నుమూసిన రోజును చరిత్రలో జూన్ 20వ తేదీ ప్రత్యేకతగా చెప్పవచ్చు.

మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ... ముస్లిం తల్లిదండ్రులకు పదో సంతానంగా నవంబర్ 12, 1896న జన్మించారు. తన పదవయేటన తల్లిదండ్రులు మరణించటంతో బంధువులైన అమీరుద్దీన్ త్యాబ్జీ, హమీదా బేగంల వద్ద పెరిగారు. ముంబయిలోనూ, బర్మాలోను విద్యాభ్యాసం చేసిన అలీకి పక్షుల అధ్యయనం పట్ల ఆసక్తి కలిగేందుకు... బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ సెక్రటరీ అయిన వాల్టర్ శామ్యూల్ మిల్లార్డ్ స్ఫూర్తిగా నిలిచారు.

జర్మనీలోని బెర్లిన్ విశ్వ విద్యాలయం జువలాజికల్ మ్యూజియంలో పక్షుల అధ్యయనాన్ని గురించి మరింత నేర్చుకున్న అలీ... 1930లో ప్రచురించిన కథనం ఈయనకు ఎంతగానో పేరు తీసుకొచ్చింది. హైదారాబాద్, కొచ్చిన్, గ్వాలియర్, తిరువాన్కూర్, ఇండోర్, భోపాల్ లాంటి స్థానిక సంస్థానాధీశుల సహకారంతో ఆయా సంస్థానాలలో ఉండే పక్షుల గురించి, వాటి సహజసిద్ధమైన నివాస స్థలాల గురించి అలీ విపులంగా అధ్యయనం చేశారు.

ఈ క్రమంలో ఎంతో దూరాన ఉండే ప్రాంతాలను సైతం సందర్శించి అలీ... భారత దేశంలో పక్షి శాస్త్రానికి సంబంధించి తనకు కలిగిన అవగాహనను, చేసిన పరిశోధనలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అలీ పరిశోధనలన్నీ తన భార్య తెహమినా తోడుగా సాగించారు. అయితే 1980లో ఒక ఆపరేషన్ జరుగుతున్న సందర్భంలో ఆమె మరణించింది. ఆ తరువాత అలీ పక్షి శాస్త్ర పరిశోధనలకు ఆయన సోదరి, బావలు తోడునీడగా నిలిచారు.

దాదాపు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ మూతపడకుండా కొనసాగేందుకు సలీం అలీ కృషి మరువరానిది. అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు లేఖ రాసి, ఆయన వద్ద నుంచి ధన సహాయం పొందిన సలీం నేచురల్ హిస్టరీ సొసైటీని నడిపించారు.

అలాగే... భరత్‌పూర్ పక్షి సంరక్షణ వనం, సైలెంట్ వాలీ నేషనల్ పార్క్‌ల పరిరక్షణ కోసం కూడా సలీం అలీ ఎంతోగానో కృషి సల్పారు. 1990లో కోయంబత్తూరు వద్దనున్న అనైకట్టిలో "సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నీథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ (ఎస్ఏసీఓఎన్)" సంస్థ కూడా ప్రారంభించబడింది. ఇది భారత ప్రభుత్వ పర్యావరణ, వన విభాగాల ఆధ్వర్యంలో పనిచేస్తుంది.

సలీం అలీ పొందిన అవార్డులు రివార్డుల విషయానికి వస్తే... 1958లో పద్మభూషన్ పురస్కారం, ఇదే సంవత్సరంలోనే "నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలోషిప్‌"ను అందుకున్నారు. ఆ తరువాత 1967లో బ్రిటీష్ ఆర్నిథాలజిస్ట్స్ యూనియన్ వారిచే "యూనియన్ మెడల్"ను అలీ అందుకున్నారు. ఈ మెడల్‌ను బ్రిటీష్ పౌరులు కాని వారికి ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ విశేషమైన గౌరవాన్ని మన అలీ పొందారు

ఆ తరువాత 1969లో వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ వారి నుండి "జాన్ సి ఫిలిప్స్ మెడల్"ను, 1976లో విశిష్టమైన పద్మ విభూషణ్ పురస్కారాన్నీ సలీం అలీ అందుకున్నారు. తదనంతరం 1976లో వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ వారి నుంచి "జె. పాల్ గెట్టీ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ అవార్డు"ను, కమాండర్ ఆఫ్ ది నెదర్లాండ్స్ ఆర్డర్ ఆఫ్ ది గోల్డన్ ఆర్క్ అవార్డును 1986లో అలీ తన ఖాతాలో వేసుకున్నారు.

1985లో రాజ్యసభకు నామినేట్ అయిన సలీం అలీ, రాజ్యసభ సభ్యుడిగానూ తన విధులను సక్రమంగా నిర్వర్తించారు. ఆ తరువాత 1987, జూన్ 20వ తేదీన 90 సంవత్సరాల వయసులో ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధి బారిన పడిన సలీం... పక్షులతోపాటు గాలిలో తేలుతూ కానరాని దూరాలకు తరలివెళ్లిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu