కారం తింటే ముక్కువెంట నీరెందుకు వస్తుంది..?
పిల్లలూ..! ఎక్కువ కారం తిన్నప్పుడు ఎవరికైనా నాలుక మండిపోవటం సహజం. అయితే నాలుక మంటతోపాటు వెంటనే ముక్కు వెంట నీళ్లు కారిపోతాయి కదా..! ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా..?కారం, తీపి, చేదు లాంటి రుచులు నాలుకకే తెలుస్తాయి కదా..! మరి తీపి, చేదు పదార్థాలను తిన్నప్పుడు స్పందించని ముక్కు కారం తింటేనే ఎందుకు ప్రతిస్పందిస్తుంది, ఎందుకు నీరు కారుస్తుంది.. అని ఆలోచిస్తే ఆశ్చర్యం వేయక మానదు.కారం తిన్న వెంటనే ముక్కులోంచి నీళ్లు కారిపోయేందుకు కారణం ఏంటంటే.. కారం లేదా ఇతర మసాలా దినుసుల్లో ఉండే "కాప్సైసిన్" రసాయనం. దీని ప్రభావం కేంద్ర నాడీ వ్యవస్థ మీద ఉంటుంది. ముక్కుల శ్లేష్మాన్ని, జీర్ణ వ్యవస్థలో రసాలను ప్రభావితం చేసే నాడీ కేంద్రం మీద కాప్సైసిన్ ప్రభావం ఉంటుంది. ముక్కు నుంచి ఎలాంటి శ్లేష్మం, ఎంత దట్టంగా కారాలనే నిర్ణయం మెదడులోని కేంద్ర నాడీ వ్యవస్థలో ఉంటుంది.మసాలా లేదా కారం ప్రభావం ఆ కేంద్రంమీద కలగగానే అది శ్లేష్మాన్ని అధికంగా స్రవింపజేస్తుంది. అదే నీటి రూపంలో ముక్కులోంచి బయటికి వస్తుంది. ఈ రసాయనం మిరియాలలో కూడా ఉంటుంది. అందుకే జలుబు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు, ముక్కు ఊపిరి ఆడకుండా బిగుసుకుపోయినప్పుడు అమ్మ మిరియాల కషాయం పెట్టిస్తుంటుంది.ఈ కషాయం తాగగానే ముక్కు వెంట చీమిడి కారి బయటకు వచ్చేస్తుంది. దాంతోపాటు జలుబుకారక సూక్ష్మక్రిములు కూడా బయటకు వచ్చేస్తాయి. దాంతో మనకు ఉపశమనం కలుగుతుంది. ఇక కారం ఎక్కువగా తిన్నప్పుడు నీళ్లు ఎన్ని తాగినా మంట తగ్గక పోవటానికి కారణం ఏంటంటే.. కాప్సైసిన్ రసాయనం నీటిలో కరగక పోవటమే. నెయ్యి, వెన్న లేదా పెరుగు లాంటివి తింటేనే కారం తగ్గుతుంది.