పిల్లలూ... ఎడారి అంటే ఏంటో తెలుసా..? ఎటు చూసినా ఇసుక, వెతికి చూసినా కాసిన్ని మంచినీళ్లు కూడా దొరకని ప్రాంతాన్నే ఎడారి అంటారు. ఎడారుల్లో ఎక్కడో ఓ చోట ఏ చిన్న ఒయాసిస్సు కనిపిస్తే తప్ప... అసలు నీటిజాడలనేవే కనిపించవు.
ఏడారి ప్రాంతాలలో కాలాన్ని బట్టి వర్షం, ఎండ, మంచు లాంటివి అసలు ఉండవు. ఏ కాలంలోనైనా నిప్పులు చెరిగే ఎండే మనకు దర్శనమిస్తుంది. తుఫాను కురిసినప్పటికీ అది ఇసుక తుఫానే అవుతుంది కానీ వర్షం ద్వారా వచ్చే తుఫాను మాత్రం కాదు. పగలంతా మండే ఎండ, రాత్రిపూట ఎముకలు కొరికే చలి... ఇదీ ఎడారుల పరిస్థితి.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎడారి "సహారా ఎడారి" కాగా, రెండోది మనదేశంలోని రాజస్థాన్ ప్రాంతంలో ఉండే థార్ ఎడారి. ఇదలా కాసేపు పక్కన పెడితే... అసలు ఎడారంటే ఇసుక సముద్రమేనా? అంటే కాదనే చెప్పాలి. కొన్ని మంచు ఎడారులు కూడా ఉన్నాయి. అవేంటంటే.. గోబి ఎడారి, మంగోలియా ఎడారి లాంటివి చెప్పుకోవచ్చు.
ఈ మంచు ఎడారుల్లో ఎప్పుడూ మంచే కురుస్తుంటుంది. అక్కడ ఎక్కువగా మంచు తుఫానులు సంభవిస్తుంటాయి. ఇసుక ఎడారి ఓడ ఒంటె అయితే... మంచు ఎడారి ఓడగా గుర్రాన్ని చెప్పుకుంటారు.