ప్రపంచ వ్యాప్తంగా ఉండే కంప్యూటర్లను అన్నింటినీ కలిపే ఒక వ్యవస్థే "ఇంటర్నెట్". ఈ ఇంటర్నెట్నే తెలుగులో "అంతర్జాలం" అని సంభోధిస్తారు. 1969వ సంవత్సరంలో అమెరికా భద్రతా విభాగం అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ అయిన "ఆర్పా (ఏఆర్‌పీఏ)"లో ఇంటర్నెట్ తొలిసారిగా సృష్టించబడింది.అలాగే 1990వ సంవత్సరంలో బ్రిటీషు శాస్త్రవేత్త అయిన టిమ్ బెర్నెల్స్ లీ స్విట్జర్లాండ్‌లోని సెర్న్ (సీఈఆర్ఎన్) వద్ద "వరల్డ్ వైడ్ వెబ్"ను సృష్టించాడు. దీనినే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని అంటారు. ప్రస్తుతం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్పీ)కు కొంత మొత్తం డబ్బును చెల్లించి ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ వాడుకునే కంప్యూటర్లను ఇంటర్నెట్కు అనుసంధానించవచ్చు. ఇలా ప్రపంచంలోని కంప్యూటర్లను అన్నింటినీ కలిపే వ్యవస్థే ఇంటర్నెట్.ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకునేందుకు ఇంటర్నెట్ ప్రొటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తుంటారు. ఇంగ్లీషులో ఇంటర్నెట్ అని రాసేటప్పుడు మొదటి అక్షరాన్ని ఎల్లప్పుడూ తప్పనిసరిగా కేపిటల్ లెటర్‌గానే రాయాల్సి ఉంటుంది.ఇంటర్నెట్కు అనుసంధానమై ఉండే ప్రతి కంప్యూటర్ ఒక సంఖ్యను కలిగి ఉంటుంది. దీనినే "ఐపీ అడ్రస్సు" అని పిలుస్తుంటారు. ఇంటర్నెట్లో ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్‌కు సందేశాలు ఈ ఐపీ చిరునామా ఆధారంగానే పంపించబడుతుంటాయి.ఇక ఇంటర్నెట్ ద్వారా లభించే సేవలను చూస్తే.. గతంలో ఉత్తరాల ద్వారా సమాచారం పంపించినట్లుగానే, కంప్యూటర్లతో"ఎలక్ట్రానిక్ మెయిల్స్" ద్వారా క్షేమ సమాచారాన్ని పంపించవచ్చు. వీటినే ఈ-మెయిల్స్ అని అంటుంటారు. అలాగే "ఛాటింగ్" అనే సౌకర్యంతో ఇంట్లో కూర్చునే కంప్యూటర్ ద్వారా ప్రపంచంలో ఏ మూలనున్నవారితోనైనా గంటలతరబడీ బాతాఖానీ కొట్టవచ్చు.
ఇంకా లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు, పత్రికలు చదివటం కాకుండా ఇంట్లో కూర్చుని కంప్యూటర్ ముందే ప్రపంచంలోని అన్ని గ్రంథాలయాల్లోని పుస్తకాలను తిరగేసి విషయ సేకరణ చేయవచ్చు. ఇందుకోసం "వరల్డ్ వైడ్ వెబ్" ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్లో ఎక్కువగా ఉపయోగించేది కూడా దీన్నే. ఇందులో వెబ్సైటులు, బ్లాగులు.. లాంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
వరల్డ్ వైడ్ వెబ్ తరువాత ఇంటర్నెట్లో ఎక్కువగా ఉపయోగించేది ఈ-మెయిల్స్‌నే. ఇందులో ఉత్తరాలను పంపించవచ్చు, ప్రత్యుత్తరాలు అందుకోవచ్చు. అయితే ఇక్కడ కాగితం అవసరం ఉండదు, కేవలం సమాచారం ఉంటే సరిపోతుంది. ఇంటర్నెట్లో రకరకాల సేవలను అందించే ప్రత్యేక వెబ్సైట్లను కూడా చూడవచ్చు. వీటనే పోర్టల్స్ అంటారు. ఇవి ఇప్పుడు తెలుగు భాషలో కుప్పలు తెప్పలుగా అందుబాటులో ఉంటున్నాయి.
అయితే ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత ఉందో, చెడు కూడా అంతే స్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఇంటర్నెట్ వినియోగిస్తున్న పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. పిల్లలు నెట్‌ను ఎందుకోసం వినియోగిస్తున్నారో గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఒకవేళ వారు చెడుదారిలో నడుస్తుంటే ప్రారంభంలోనే గుర్తించి, పిల్లల్ని సక్రమైన దారిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదిలా ఉంటే.. గంటలకొద్దీ నెట్లో గడిపేవారు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఎక్కువగా సందర్శించేవారు క్యాన్సర్, గుండెజబ్బులు, మానసిక రుగ్మతల బారిన పడే అవకాశం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మంచి, చెడు.. లాభం, నష్టం కలగలసిన ఇంటర్నెట్ను ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ రకమైన ఫలితాలే వస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు.