Publish Date: Thu, 23 Oct 2008 (12:25 IST)
Updated Date: Thu, 23 Oct 2008 (12:25 IST)
పిల్లలూ... యోగాసనాలు గురించి మీరు వినే ఉంటారు. మీ ఇళ్ళల్లో అమ్మా నాన్నలు కూడా ఆసనాలు వేస్తూ ఉంటారు కదా..! అసలు ఈ ఆసనాలు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక మనిషి శారీరకంగా వ్యక్తపరిచే ఎలాంటి భంగిమనైనా సరే ఆసనం అనవచ్చు. అయితే ఆసనం పుట్టుక గురించి ఎలాంటి మూలాధారాలు మనకు అందుబాటులో లేవు. మనిషి పుట్టిన నాటినుంచీ ఇది ఉంది. ఉయ్యాలలో పడుకోబెట్టిన పసిపిల్లలు చేసే విన్యాసాలు కూడా ఆసనాల క్రిందికే వస్తాయి.
అయితే భంగిమలనేవి ఒక క్రమపద్ధతిలో ఉంటూ, తగినంత వ్యాయామం చేస్తే వాటినే యోగాసనాలు అనవచ్చు. ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవడానికి కనీసం 25 రకాల ఆసనాలనైనా వేయడం అవసరమని యోగా పండితులు చెబుతుంటారు.
ఇక చరిత్ర విషయానికి వస్తే... భగవద్గీతలో శ్రీకృష్ణుడు, ఉపనిషత్తులలో మహర్షులు యోగ విజ్ఞానానికి సంబంధించిన పలు విషయాలను వ్యక్తపరిచారు. అవి ఏంటంటే, రాజ, హఠ, కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగము లాంటివి. వీటిలో రాజయోగం శ్రేష్టమైనది చెబుతుంటారు.
అసలు యోగాసనాలు ఎందుకు వేయాలి? అంటే.. మానవ శరీరం పలురకాల మాలిన్యాలతో పేరుకుంటూ ఉంటుంది. శరీరంలో కలిగే అనారోగాలకు ఈ మాలిన్యాలే కారణం కాబట్టి, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. ఈ మాలిన్యాల నిర్మూలకు యోగా ఒక చక్కటి పరిష్కారం. యోగా వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల పెద్దగా కష్టపడనవసరంలేని ఈ ఆసనాలను వేయటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి.