Publish Date: Tue, 23 Sep 2008 (12:30 IST)
Updated Date: Tue, 23 Sep 2008 (12:29 IST)
పిల్లలూ..! ఆర్కిమెడిస్ ఎవరో మీకు తెలుసా..? ఆర్కిమెడిస్ పేరెన్నిగన్న గ్రీకు గణిత, భౌతిక శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కర్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు. అనేకమైన వినూత్న యంత్రాలను కనిపెట్టినవాడు. ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసిన ఈయన నీళ్లుపైకి తోడే ఆర్కిమెడిస్ స్క్రూ, ఓడోమీటరు లాంటి సాధనాలెన్నింటినో రూపొందించాడు.
ఆర్కిమెడిస్ భౌతిక శాస్త్ర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసిన "ఆర్కిమెడిస్ సూత్రాన్ని" కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త. అసలు ఆర్కిమెడిస్ సూత్రం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
ఒక వస్తువును ద్రవంలో ముంచితే అది కొంత భారాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఈ కోల్పోయిన భారం ఆ వస్తువును "ముంచడం వల్ల పొర్లిపోయిన ద్రవ, ఘన పరిమాణ భారానికి సమానం అవుతుంది" దీన్నే ఆర్కిమెడిస్ సూత్రం అని అంటారు.
ఇదలా ఉంచితే... మనలోని చాలామంది బాగా సంతోషంగా ఉన్నప్పుడు "యురేకా" అని అరిచే ఉంటాం. యురేకా అంటే "నేను కనుగొన్నాను" అని అర్థం. మనం పైన చెప్పుకున్న శాస్త్రవేత్త ఆర్కిమెడిస్... తాను ఆర్కిమెడిస్ సూత్రాన్ని కనుగొన్నప్పుడు కూడా ఇలాగే యురేకా అని అరుస్తూ... సంతోషంతో పరుగులు తీశాడట. అప్పటినుంచి ఈ యురేకా అన్న మాట విస్త్రృతంగా వాడుకలోకి వచ్చింది.