ఆ ముగ్గురు అమ్మలంటే నాకెంతో ఇష్టం: బర్త్ డే బేబీ కలాం
తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరినీ తాను కలవగలగటం తన అదృష్టమనీ... వారిలో ఒకరు కన్నతల్లి కాగా, మరొకరు భారత సంగీతానికి అమ్మ అయిన ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఇంకొకరు ప్రపంచ ప్రజలందరికీ అమ్మ అయిన మదర్ థెరిస్సా... అని పసిపిల్లాడిలా సంబరపడిపోతూ చెబుతుంటారు మన మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంగారు. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా, ఆయన జ్ఞాపకాల్లోకి అలా తొంగిచూసే చిరు ప్రయత్నం....తాను తిరుచ్చిలో చదువుకుంటున్నప్పుడు విన్న "ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు" అనే పాట తనను ఎంతగానో ప్రభావితం చేసిందనీ, అప్పట్నించీ సుబ్బలక్ష్మిగారి సంగీతం అంటేనే ఎంతో అభిమానమని అంటుంటారీయన. భారతరత్న అవార్డును తీసుకుంటున్న సమయంలో తన తలను సుబ్బలక్ష్మిగారు నిమిరిన ఘటనను తానెప్పటికీ మరవలేననీ ఉద్వేగభరితులవుతుంటారు. ఇక దేశంకాని దేశంలో పుట్టి.. భారతావనికి 40 సంవత్సరాలపాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనంటారు కలాంగారు.ఇక కలాంగారి చిన్ననాటి జ్ఞాపకాల విషయానికి వస్తే... ఉదయం నాలుగ్గంటలకల్లా అమ్మ నిద్రలేపితే, అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కు వెళ్లేవారట. అంత ఉదయాన్నే స్నానం చేయటం అంటే కష్టమైనప్పటికీ.. స్నానం చేసి రాకపోతే మాస్టారు పాఠాలు చెప్పనని భీష్మించుకు కూర్చుంటారు కాబట్టి, తప్పనిసరిగా స్నానం చేసే వెళ్లేవారట. ట్యూషన్ నుంచి ఇంటికి, అటునుంచి నమాజ్‌కు వెళ్లేవారట.
శాస్త్రజ్ఞుడిగా, సాంకేతికరంగ నిపుణుడిగానేకాక.. రచయితగా, దార్శనికుడిగా ఆయన విశేష ప్రతిభను కనబరిచారు. ఈయన రచించిన ఆత్మకథ "వింగ్స్ ఆఫ్ ఫైర్" (ఒక విజేత ఆత్మకథ), "ఇగ్నైటెడ్ మైండ్స్" (నా దేశ యువజనులారా) పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్‌గా పలు రికార్డులు...
నమాజ్ పూర్తయ్యాక రైల్వేస్టేషన్‌కు వెళ్లి.. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ను తీసుకుని వాటిని పంపిణీ చేసేవారట. ఇలా చిన్నప్పటినుంచి తాను పనిచేస్తూనే చదువుకున్నానని కలాం చెబుతుంటారు. ఉమ్మడి కుటుంబం, ఎక్కుమంది సభ్యులున్నా.. అమ్మ మాత్రం తనకెప్పుడూ ఇతరులకంటే కాస్త ఎక్కువగానే తిండి పెట్టేదని మురిసిపోతూ చెబుతారు. ఇంట్లో అందరికంటే చిన్నవాడిని అవటం, పైగా పనులు చేస్తూ చదువుకుంటూ ఉండటంవల్ల అమ్మ నాపై కాస్త ఎక్కువ శ్రద్ధ చూపించేదని కలాం చెబుతుంటారు. ఇక తమ ఇంట్లో అందరి ఇళ్లలాగే ఆనందం, విషాదం రెండూ కలగలిసి ఉండేవంటారు.కలాంగారి జీవిత వివరాల్లోకి వస్తే... ఏపీజే అబ్దుల్ కలామ్ అని పిలవబడే, డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలామ్ 1931, అక్టోబర్ 15వ తేదీన.. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం సమీపంలోగల ధనుష్కోటిలో జన్మించారు. ఈయన తండ్రిపేరు జైనులాబ్దీన్ మరకయార్, తల్లి పేరు అషిమా. తండ్రి పడవ నడుపుకుంటూ జీవనం సాగిస్తుండటంతో.. కలాంకు ప్రాధమిక స్ధాయి వరకే చదువు చెప్పించగలిగారు. తరువాత కలాంగారు తన స్వయంకృషితోనే విద్యాభ్యాసం సాగిస్తూ, పేపర్ బాయ్‌గా కూడా పని చేశారు.అలా పేపర్ బాయ్‌గా పనిచేసే సమయంలో... వివిధ పత్రికల్లో వచ్చే యుద్ధ విమానాలు, క్షిపణుల బొమ్మలను చూసి, తాను ఏనాటికైనా విమానాన్ని నడపాలని, పైలెట్‌గా అవ్వాలని కలలుగన్నారు. తండ్రిలోని ఆధ్యాత్మికత, రామేశ్వరంలోని ప్రశాంత వాతావరణం, వివిధ వర్గాల మధ్య సామరస్యం కలామ్‌గారిపై గాఢమైన ప్రభావం చూపాయనవచ్చు.
ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న తరువాత కలాంగారు మద్రాసులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. ఆ తరువాత 1958వ సంవత్సరంలో డీఆర్డీవోలో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్)లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తదనంతరం 1963లో ఇస్రోలో చేరటం.. అప్పట్నించి అనేక ప్రయోగాలలో పాలుపంచుకుని ప్రఖ్యాత శాస్త్రవేత్తగా పేరు సంపాదించారు.1981
లో భారతదేశం ప్రయోగించిన 35 కేజీల బరువుగల రోహిణి ఉపగ్రహం విజయవంతం కావటంలో కలాంగారు తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. ఇక ఆ తరువాత కాలంలో క్షిపణుల రంగంలో సాధించిన విజయాలు ఆయన పేరును ప్రపంచవ్యాప్తం చేశాయి. భారతావనిని శత్రుభీకరంగా తీర్చిదిద్దటమేగాక.. "భారతదేశ క్షిపణి కార్యక్రమ పిత"గా కలాం ప్రఖ్యాతిగాంచారు.19
సంవత్సరాలపాటు ఇస్రోలో పనిచేసిన తరువాత 1982లో కలాంగారు మళ్లీ డీఆర్డీవోలోకి అడుగుపెట్టారు. అక్కడ "పృథ్వి, అగ్ని" లాంటి క్షిపణులను తయారు చేయటం ద్వారా భారత రక్షణ రంగాన్ని అత్యుత్తమస్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దారు. 1999వ సంవత్సరంలో జరిగిన "పోఖ్రాన్" అణుపరీక్షలు కలాంగారి ఆధ్వర్యంలో విజయవంతమై సంచలనం సృష్టించటమేగాక.. ఆయన పేరు ప్రప్రంచవ్యాప్తంగా మార్మోగిపోయింది.కలాంగారు శాస్త్రజ్ఞుడిగా, సాంకేతికరంగ నిపుణుడిగానేకాక.. రచయితగా, దార్శనికుడిగా ఆయన విశేష ప్రతిభను కనబరిచారు. దాదాపు 50 మందికి పైగా శాస్త్రజ్ఞులు, దార్శనికులతో సమావేశం ఏర్పాటు చేసిన ఈయన.. భారతదేశ భవిష్యత్ కార్యక్రమ ప్రణాళికపై అందరి సూచనలు, సలహాలతో రూపొందించిన "విజయం 2020" పలువురి ప్రశంసలను చూరగొంది. అలాగే ఈయన రచించిన ఆత్మకథ "వింగ్స్ ఆఫ్ ఫైర్" (ఒక విజేత ఆత్మకథ), "ఇగ్నైటెడ్ మైండ్స్" (నా దేశ యువజనులారా) పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్‌గా పలు రికార్డులు సృష్టించాయి.ఆ తరువాత ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసిన కలాంగారు... మద్రాస్ ఐఐటీ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. అయితే 2002వ సంవత్సరంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్నికలు నామమాత్రంగా జరిగి, కలాంగారు రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఒక శాస్త్రవేత్త భారతదేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికవడం మన దేశ చరిత్రలో అదే ప్రథమంకాగా.. ఆ అరుదైన గౌరవానికి ఈయన పాత్రులయ్యారు. తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, రాష్ట్రపతి పదవికే వన్నె తేచ్చిన ఏపీజే అబ్దుల్ కలాంగారు పదవీ కాలం ముగియటంతో బాధ్యతలనుంచి తప్పుకున్నారు.కానీ, కలామ్‌గారి ముందు ఇంకా చాలా ఆశయాలున్నాయి, నిజం చేసుకోవాల్సిన కలలున్నాయి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... "మనమందరం మనలో ఒక దివ్యాగ్నితో జన్మించాం. మన ప్రయత్నాలెపుడూ ఆ అగ్నికి రెక్కలిచ్చేవిగా వుండాలి. తద్వారా యీ ప్రపంచమంతా సత్ప్రకాశంతో వెలుగు పొందాలి". "ఆదరంగా, సాహసంగా, సత్యంగా.. క్షణం, క్షణం... సుదీర్ఘ దినాంత వేళదాకా... పనిచేసిన హస్తాలే బహు సుందరాలు..."