ఈ భూమండలం అనేక జీవరాశులకు నిలయం. మానవుడి దృష్టిలో పడని జీవరాశులు ఎన్నెన్నో. ఐతే భూమిపై మానవుడి నిత్యం శోధన చేస్తూనే ఉన్నాడు. అడవులు, నీటి ప్రవాహాలు, నదులు, సముద్రాలు... మంచుకొండలు.... ఇలా అనేక ప్రాంతాలను పరిశీలిస్తూ అక్కడి పరిస్థితులను, జీవరాశుల మనుగడను తెలుసుకుంటున్నాడు. పరిశోధనలో భాగంగా ఇటీవల హిమాలయాలపై కొందరు శాస్త్రజ్ఞలు పర్యటించినపుడు వారికి అరుదైన జాతుల ఆనవాళ్లు అగుపించాయి.
సుమారు 211 జాతులను కనుగొనగా వాటిలో రెండు రకాల జాతుల ప్రవర్తన వారికి ఆసక్తిని రేకెత్తించాయట. దాంతో ఆ జాతులపై మరింత లోతుగా అధ్యయనం చేసినప్పుడు పలు విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా హిమాలయాల్లో రెండు భిన్నమైన జాతుల గురించి వారు నిశితంగా గమనించినప్పుడు... ఒకటి నేలపై నడిచే చేప. ఇది నేలపై నాలుగు రోజుల పాటు అలాగే ఉండగలదట. అలాగే సుమారు 400 మీటర్ల మేర గెంతుకుంటూ వెళ్లగలదట. చేప అనగానే నీటిలో మాత్రమే ఉంటుందని అనుకుంటారు కానీ ఈ చేప గాలిని పీల్చుతూ నాలుగురోజుల పాటు భూమిపై ఉండగలదట.
అదేవిధంగా హిమాలయాల్లో ఒకరకమైన జాతికి చెందిన కోతులుండేవట. వర్షం వచ్చినప్పుడు అవి తుమ్మడం ప్రారంభించేవట. దీనికి కారణం... వాటి ముక్కులు పైకి లేచి ఆకాశం వైపు చూస్తున్నట్లుండటమే. అందువల్ల వర్షం రాగానే వర్షపు చినుకులు నేరుగా వాటి ముక్కురంధ్రాల్లోకి చేరడంతో తమ్ములు వచ్చేవి.
ఈ బాధను భరించలేని ఆ కోతులు తమ ముఖాన్ని రెండు కాళ్లకు మధ్యలో పెట్టుకుని అలా వంచుకుని వర్షం పడినంత సేపు కూర్చునే ఉండేవట. ఇలాంటి ఎన్నో జాతులు ఇప్పుడు నశించిపోయాయనీ, పర్యావరణ కాలుష్యం కారణంగా ఎన్నో జాతులు కనుమరుగయిపోతున్నాయనీ, ఇలాగే వదిలేస్తే మనిషి మనుగడకు ఏదో ఒకరోజు ముప్పు తప్పదని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.