Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా తెలుగు కవికి మల్లెపూదండ...!!

Advertiesment
బాలప్రపంచం
FILE
"మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి"

అంటూ... నేలను నేలతల్లిగా, కన్నతల్లిగా, తెలుగు తల్లిగా మార్చి ఆరాధ్యనీయం చేసిన మహనీయుడు శంకరంబాడి సుందరాచారి. కన్నతల్లిచేత మంగళహారతులు పొందే పిల్లలున్నారుగానీ, కన్నతల్లికి మంగళహారతులు పట్టేవారు అప్పటిదాకా లేరు. అయితే, 1956లో పొట్టి శ్రీరాములు బలిదానంతో ఆంధ్రప్రదేశ్ తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా అవతరించే క్రమంలో ఈ "తెలుగుతల్లి గీతం" ఆంధ్రుల అభిమాన గీతంగా మారింది.

ఆంధ్రుల భావోగ్వేగానికి ప్రతీకగా, వారి ఆత్మలకు ప్రతిరూపంగా మారిన ఈ తెలుగుతల్లి గీతంలో గొప్ప సాహిత్యం లేకపోయినా... అందరినీ ముక్తకంఠంతో కలిపే "మా" అనే ఏకత్వం ఉంది. గురజాడ "దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్.." అంటూ దేశాన్ని మనుషులుగా గుర్తించి, దేశంపట్ల మమకారాన్ని పెంచితే... శంకరంబాడి తెలుగుతల్లిని కన్నతల్లిగా చేశారు. అందరినీ ఆమె కన్నబిడ్డలుగా చేసిన ఆయన మాతృభావనతో మమకారం పెంచారు. ఈరోజు ఆ మహనీయుడి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన స్మృతిలో....
మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు...
పతిభక్తిని ప్రస్తావిస్తూ మల్లమ్మను, ధీరత్వాన్ని ప్రస్తావిస్తూ తిమ్మరుసును, కీర్తిని చాటుతూ కృష్ణదేవరాయలను తీసుకోవడమంటే, అత్యున్నతమైన ప్రతీకలను వాడుకోవటమే...! ఆ గీతాన్ని అంతటితో ముగించకుండా "మా చెవుల రింగుమని మారుమ్రోగేదాకా, నీ ఆటలే ఆడుతాం, నీపాటలే...
webdunia


తెలుగు నేల వర్ణన, పూర్వవైభవ ప్రశస్తి మెండుగా కనిపించే ఈ గీతంలో... "గలగలా గోదారి, బిరబిరా కృష్ణమ్మ" అనే పదాలను పలుకుతుంటే, వింటున్నవారి కళ్లెదుట అవి ప్రవహిస్తున్న భావనను కలిగిస్తాయి. అలాగే "అమరావతీ నగర అపురూప శిల్పాలు" అనేదాంట్లో కళావైభవానికి నిదర్శనాలుగా, "త్యాగయ్య గొంతులో తారాడే నాదాలు" నాటి సంగీత వైభవానికి తార్కాణంగా.. "తిక్కయ్య కలములో తియ్యందనాలు" సాహితీ మధురిమకు ఆనవాళ్లుగా మనముందు సాక్షాత్కరిస్తుంది.

పతిభక్తిని ప్రస్తావిస్తూ మల్లమ్మను, ధీరత్వాన్ని ప్రస్తావిస్తూ తిమ్మరుసును, కీర్తిని చాటుతూ కృష్ణదేవరాయలను తీసుకోవడమంటే, అత్యున్నతమైన ప్రతీకలను వాడుకోవటమే...! ఆ గీతాన్ని అంతటితో ముగించకుండా "మా చెవుల రింగుమని మారుమ్రోగేదాకా, నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం" అంటూ సమస్త తెలుగుజాతి పక్షాన... శంకరంబాడి ఎలుగెత్తి చాటారు.

శంకరంబాడి జీవిత విశేషాల్లోకి వస్తే... 1914వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీన శంకరంబాడి సుందరాచారి తిరుపతిలో జన్మించారు. మదనపల్లిలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించిన ఈయన చిన్నతనం నుంచే స్వతంత్రభావాలను కలిగి ఉండేవారు. బీ.ఏ. పట్టా పుచ్చుకున్న అనంతరం కొంతకాలం చిత్తూరు, కడప జిల్లాలలో పాఠశాల ఇన్‌స్పెక్టరుగా విధులు నిర్వహించారు. ఆయన ప్రవృత్తి కారణంగా ఆ ఉద్యోగంలో కొనసాగలేక పోయారు.

ఆ తరువాత.. శంకరంబాడి కొంతకాలం ఉపాధ్యాయుడిగా, మరికొంతకాలం ఆంధ్రపత్రికలో ఫ్రూఫ్‌రీడర్‌గా పనిచేశారు. స్వతంత్ర ప్రవృత్తి, స్వేచ్ఛా జీవనం కారణంగా ఆయన ఎందులోనూ ఇమడలేకపోయారు. సినీ అవకాశం రావడంతో సినీ రచయితగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు. "దీనబంధు", "బిల్వణి" తదితర చిత్రాలకు సంభాషణలు, గీతాలను ఆయన రచించారు.

శంకరంబాడి "తెలుగుతల్లి గీతాన్నే" కాకుండా ఎన్నో రకాల రచనలు చేశారు. రామాయణం, మహాభారతం, మహాభాగవతం లాంటి కావ్యాలను సైతం సులభశైలిలో పాఠకులకు అందించారాయన. బుద్ధగీత, అగ్నిపరీక్ష, సుందర సుధాబిందువులు లాంటి కావ్యాలను రాశారు.

తెలుగుజాతి గర్వించదగ్గ "తెలుగుతల్లి గీతాన్ని" ఆంధ్రులకు అందించిన శంకరంబాడి జీవితం చివరిదశ మాత్రం చాలా దయనీయంగా సాగింది. రాష్ట్రానికి ఎనలేని కీర్తి తెచ్చిన తెలుగుతల్లి గీతంగానీ, మధురంగా తెలుగులో అందించిన రామాయణం తదితర కావ్యాలుగానీ ఆయనకు తిండిపెట్టలేకపోయాయి. అయితే లోకం మాత్రం ఆయనను "ప్రసన్న కవి"గా గుర్తించి గౌరవించింది.

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మొదటి తెలుగు ప్రపంచ మహాసభల్లో తెలుగుతల్లి గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేసింది. అధికార సభల్లోనూ, కార్యక్రమాల్లోనూ తప్పనిసరిగా తెలుగుతల్లి గీతం పాడాల్సిందే...! తెలుగువారికి ఒక గీతాన్ని, దానికో ఆత్మను, ఆత్మకు ఒక ఆత్మగౌరవాన్ని తొడిగి వినువీధుల్లో ఎగురవేసిన శంకరంబాడి సుందరాచారి 1977 ఏఫ్రిల్ 18వ తేదీన పరమపదించారు.

Share this Story:

Follow Webdunia telugu