రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడిన వీర సైనికుడిగా.. రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్ఫీన్స్‌కు మూడవ అధ్యక్షుడిగా తన అమూల్యమైన సేవలను అందించిన ఆదర్శనీయుడు రామన్ డెల్ ఫియర్ మెగసెసె. సామాజిక సేవలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన రామన్ మెగసెసె జన్మదినం నేడే...! ఈ సందర్భంగా ఆయన స్మృతిలో...జపాన్ దాస్య శృంఖలాల నుండి ఫిలిప్ఫీన్స్‌కు విముక్తి కలిగించేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయని ధీరుడు రామన్ మెగసెసె. అధ్యక్షుడిగా ఫిలిఫ్పీన్స్‌ను అభివృద్ధి దిశగా నడిపించిన నవ యోధుడాయన. ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా తన పేరుమీదనే "రామన్ మెగసెసె" అవార్డును ప్రవేశపెట్టారు. ఆసియా నోబెల్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో కృషి చేసిన ఆసియా ప్రముఖులకు అందజేస్తారు. ఫిలిప్పీన్స్‌లోని జాంబ్‌లెస్ ప్రావిన్స్, ఇబా పట్టణంలో 1907 ఆగస్ట్ 31న జన్మించారు రామన్ మెగసెసె. తండ్రి ఎక్స్‌క్వీనియల్ మెగసెసె, తల్లి పెర్‌ఫెక్టా డెల్ ఫియరో. తండ్రి ఐరన్ హార్డ్‌వేర్ షాప్‌లో పనిచేసేవాడు. తల్లి స్కూల్ టీచర్. మధ్యతరగతి కుటుంబం కావడంతో మెగెసెసె చిన్నతనంలో చాలా కష్టాలనుభవించారు. అందుకే యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే డ్రైవర్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసేవారు.1928-32
మధ్యకాలంలో జోస్ రిజాల్ కాలేజ్ నుండి కామర్స్ డిగ్రీని తీసుకున్న రామన్ ఆ తరువాత కొన్నాళ్ళు ఆటోమొబైల్ మెకానిక్‌గా పనిచేశారు. అటుపిమ్మట కొన్నాళ్ళ పాటు మెకానిక్ షాప్ ఓనర్‌గా కూడా వ్యవహరించిన ఆయన రెండవ ప్రపంచయుద్ధం మొదలు కావడంతో ఆర్మీలో చేరారు. యుద్ధంలో భాగంగా జపాన్ కంబంధ హస్తాల్లో ఉన్న ‘బటాన్’ ప్రావిన్స్ విముక్తి కోసం పోరాడారు. అయితే బటాన్ జపాన్ హస్తగతం కావడంతో అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆ తరువాత రామన్ జంబాలెస్ ప్రావిన్స్ విముక్తి కోసం అమెరికా సైన్యంతో కలిసి గెరిల్లా పోరాటం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి చెందడంతో రెండు ప్రావిన్స్‌లు ఫిలిప్పీన్స్ వశమయ్యా యి. ఇక దేశం సుభిక్షంగా ఉంటుందని అనుకుంటున్న తరుణంలో, ఫిలిప్పీన్స్‌లో అంతర్గత పోరు ఆరంభమైంది. కమ్యూనిజం భావజాలంతో కొన్ని శక్తులు దేశంలోని అవినీతిని అంతమొందించడానికి అతివాద ఉద్యమాలను చేపట్టాయి.పెనుసవాలుగా మారిన ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాలకు వ్యతిరేకంగా రామన్ మళ్ళీ కదనరంగంలోకి దూకాల్సి వచ్చింది. గెరిల్లా పోరాటంలో అనుభవం ఉండటంతో అప్పటి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు క్విరినో మెగసెసెకు వర్తమానం అందించాడు. ఆయనను "నేషనల్ డిఫెన్స్ అకాడమి" సెక్రటరీగా నియమించాడు. ఈసారి అంతర్గత శతృవులను అంతమొందించడానికి ఆయన గెరిల్లా పోరాటం చేశారు. ఎట్టకేలకు విజయం సాధించి, ఫిలిప్పీన్స్‌లో ఒక మహోన్నత శక్తిగా మారిపోయారు.
కమ్యూనిస్ట్, మార్క్సిస్ట్ భావజాలంతో ప్రభుత్వ యంత్రాంగపై "హుక్ బలహాప్" గెరిల్లా పోరాటం పేరిట యుద్ధం సాగించిన కమ్యూనిస్ట్‌లు చివరికి ఓటమిపాలయ్యారు. దీంతో ఫిలిప్పీన్స్‌లో శాంతి పవనాలు వీచాయి. ఈ విజయంతో ఫిలిప్పీన్స్ ప్రజల గుండెల్లో ఆరాధ్యుడిగా మారిపోయారు రామన్ మెగసెసె. ఆ తరువాత కమ్యూనిజం ఉద్యమానికి ప్రభుత్వ అవినీతే కారణమని ప్రకటించాడు రామన్.. ఈ వ్యాఖ్యలు అప్పటి అధ్యక్షుడు క్విరినోకు మింగుడుపడలేదు.
ఈ పరిణామాలు ఫిలిప్పీన్స్‌లో రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. దాంతో రామన్, నేషనల్ డిఫెన్స్ అకాడమి సెక్రటరీ పదవిని వదులుకోవాల్సివచ్చింది. ఆ తరువాత "గుడ్ విల్ టూర్"తో అమెరికాలో పర్యటించిన రామన్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. దాంతో ఆయన 1953లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయఢంకా మోగించి రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్‌కు మూడం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ప్రెసిడెంట్‌గా ఉన్నంత కాలంలో అమెరికాతో స్నేహ సంబంధాలను నెరపిన రామన్... ఫిలిప్పీన్స్‌ను అభివృద్ధి పథంలో నడిపించారు. కోల్డ్ వార్ సమయంలో దక్షిణాసియాలో కమ్యూనిజానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. "సౌత్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్"ను స్థాపించి దక్షిణాసియా దేశాలన్నింటిని ఒక్క త్రాటిపై నడిపించారు.
అలా కమ్యూనిజానికి వ్యతిరేకంగా పోరాడి ఫిలిప్పీన్స్‌లో శాంతి స్థాపనకై తన జీవితాన్ని దారబోసిన రామన్ మెగసెసె 1957 మార్చి 17వ తేదీన ఒక విమాన ప్రమాదంలో మృతి చెందారు. ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తిగా రామన్‌ను కొనియాడుతూ ఆయన సేవకు గుర్తింపుగా.. ఆయన పేరుతోనే ఒక అవార్డును ప్రవేశపెట్టారు. 1957 ఏప్రిల్ మాసంలో న్యూయార్క్‌లోని "రాక్‌వెల్ బ్రదర్స్" ఫౌండేషన్ వారు ఈ అవార్డును నెలకొల్పారు.
ప్రతి సంవత్సరం, వివిధ రంగాల్లో కృషి చేసిన ఆసియాకు చెందిన ప్రముఖులకు ఈ అవార్డును బహుకరిస్తారు. ఆసియా నోబెల్‌గా పేరొందిన ఈ అవార్డును ప్రభుత్వ సర్వీసులు, కమ్యూనిటీ లీడర్‌షిప్, జర్నలిజం, లిటరేచర్, శాంతి తదితర రంగాలలో సేవచేసినవారికి అందజేస్తారు. తన జీవితకాలం మొత్తం శాంతికోసం పోరాటం చేసిన రామన్ మెగసెసె ఈనాటి యువ రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడు.