Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చరిత్రలో జూన్ 9 : ప్రధానిగా శాస్త్రీజీ నియామకం

చరిత్రలో జూన్ 9 : ప్రధానిగా శాస్త్రీజీ నియామకం
స్వతంత్ర భారతదేశపు మూడవ ప్రధానమంత్రిగా... లాల్ బహాదుర్ శాస్త్రి నియమితులైన రోజుగా, చరిత్రలో జూన్ 9వ తేదీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈయన 1964వ సంవత్సరం, జూన్ 9వ తేదీన భారతదేశపు మూడవ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు. శాస్త్రీజీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేందుకు ముందు, స్వాతంత్రోద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు.

లాల్ బహాదుర్ శాస్త్రి జీవిత వివరాల్లోకి వస్తే... యునైటెడ్ ప్రావిన్స్ (ప్రస్తుత ఉత్తర ప్రదేశ్)లోని మొఘల్‌ సరాయిలో జన్మించారు. 1921వ సంవత్సరంలో జాతిపిత మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమములో పాల్గొనేందుకోసం.. ఈయన కాశీలోని జాతీయవాద కాశీ విద్యాపీఠములో చదవడం ప్రారంభించారు.

అక్కడ విద్యాభ్యాసం అనంతరం 1926వ సంవత్సరంలో శాస్త్రీజీ పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత స్వాంతంత్ర్యోద్యమ పోరాటంలో పాల్గొని, తొమ్మిది సంవత్సరాల పాటు జైలులోనే గడిపారు. సత్యాగ్రహ ఉద్యమం తర్వాత 1940వ సంవత్సరం నుండి 1946 వరకు ఈయన జైళ్లోనే ఉన్నారు.

స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గంలో గృహమంత్రిగా పనిచేశారు. 1951లో లోక్‌సభ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యారు. ఆ తరువాత కేంద్ర రైల్వే శాఖామంత్రిగా పనిచేశారు. తమిళనాడులోని అరియళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. సాధారణ ఎన్నికల తర్వాత శాస్త్రీజీ తిరిగీ కేంద్ర మంత్రివర్గంలో చేరి, తొలుత రవాణా శాఖామంత్రిగా, ఆతర్వాత 1961 నుండి గృహమంత్రిగా పనిచేశారు.

1964వ సంవత్సరంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత, ఆయన స్థానాన్ని పూరించేందుకై... శాస్త్రీజీ మరియు మొరార్జీదేశాయ్‌లు సిద్దంగా ఉండగా... అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్ సోషలిస్టు భావాలున్న శాస్త్రీజీకి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యారు. శాస్త్రీజీ అలా 1964, జూన్ 9న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

శాస్త్రీజీ ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహర సంక్షోభం నెలకొని ఉండింది. ఈ సంక్షోభాన్ని తాత్కాలికంగా పరిష్కరించేందుకోసం ఆయన విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేయించారు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారం కోసంగానూ, దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) బాటలుపరిచారు.

1965 ఆగష్టులో, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్మూకాశ్మీరులోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ప్రధానిగా భారతావనికి రెండు సంవత్సరాలపాటు సేవలు చేసిన లాల్ బహదూర్ శాస్త్రి 1966, జనవరి 11వ తేదీన కానరాని దూరాలకు తరలిపోయారు. కాగా... మరణించేనాటికి శాస్త్రీజీ వయసు 61 సంవత్సరాలు మాత్రమే. తన జీవితకాలం మొత్తంమీదా దేశ సేవకోసమే ప్రాకులాడిన శాస్త్రీజీకి... దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని, ఆయన మరణానంతరం 1966వ సంవత్సరంలో ప్రభుత్వం ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu