థామస్ యంగ్ 1773లో ఇంగ్లండ్‌లో జన్మించాడు. ఆయన భౌతిక శాస్త్రవేత్తగా, వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. పద్నాలుగవ ఏటనే లాటిన్, గ్రీక్, పర్షియన్, అరబిక్, ఫ్రెంచ్, ఇటాలియన్, హిబ్రు భాషలలో పట్టు సాధించిన మేధావి. లండన్‌లో వైద్యశాస్త్రం అభ్యసించి అక్కడే ప్రాక్టిస్ కూడా పెట్టాడు. తనలోని పరిశోధనా దృష్టి వల్ల ఎన్నో శాస్త్రీయ సిద్ధాంతాలను వెలికి తీశాడు. మన కంటిలోని లెన్సు ఆకారం మార్చుకుని మనం చూసే వస్తువులపై ఫోకస్ చేస్తుందని మొట్టమొదట కనిపెట్టింది యంగ్.
అలాగే కంటిలో కేవలం మూడు రంగులను (ఎరుపు, ఆకుపచ్చ, నీలం) మాత్రమే గ్రహించే గ్రాహకాలుంటాయని, ఆ మూడు రంగులు కలిసి మనం చూసే అనేక రంగులు తయారవుతాయని తెలిపిందీ యంగే. కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం వారు 1801వ సంవత్సరంలో యంగ్‌ని భౌతికశాస్త్ర ఆచార్యునిగా నియమించారు.
కాంతి తరంగ లక్షణాలు, స్థితిస్థాపకత, తలతన్యత వంటి విషయాలలో చేసిన పరిశోధనలు ఆయనకు గొప్ప పేరు తెచ్చి పెట్టాయి. పదార్థాల గట్టిదనం కొలవడానికి వాడే యూనిట్‌కి యంగ్స్ యాడ్యులస్ అని పేరు పెట్టి ఆయనను గౌరవించారు. అనేక శాస్త్రీయ పలిశోధనల్లో ప్రత్యేకించి ఆప్టిక్స్‌లో ధామస్ యంగ్ అపూర్వప్రతిభ చూపించాడు. ఆయన 1829వ సంవత్సరంలో మరణించాడు.