వర్షం పడినప్పుడే పుడతాయా..? ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు కదూ..? మరేం లేదు పిల్లలూ, అలా వర్షం పడినప్పుడు పుట్టేవే పుట్టగొడుగులు. వీటినే ఇంగ్లీషులో మష్రూమ్స్ అని అంటారు. ఇవి ఒక రకమైన శిలీంధ్ర జాతికి చెందిన మొక్కలు.
ఈ పుట్టగొడుగులు మిగతా మొక్కల్లాగా తన ఆహారాన్ని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకోలేవు. అందుకనే ఇవి ఆకుపచ్చగా ఉండవు. ప్రస్తుతం ఆహారంలో ఉపయోగించే పుట్టగొడుగులను ప్రత్యేకంగా కుటీర పరిశ్రమల్లాగా కూడా పెంచుతున్నారు.
అయితే ఈ పుట్టగొడుగులు సహజంగా ఎదిగేవి మాత్రం వర్షం పడిన తరువాత పొలంగట్లు, పెద్ద పెద్ద చెట్ల మొదళ్ళు, సారవంతమైన మట్టికుప్పల వద్ద పుట్టుకొస్తాయి. వీటిలో గొడుగులాంటి భాగం కింద ఉండే మొప్పల్లాంటి అరల్లో సంతాన బీజాలు తయారవుతాయి. ఇవి గాలి ద్వారా వ్యాప్తి చెంది అనువైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మొలకెత్తుతాయి.
పుట్టగొడుగులు మొలకెత్తేందుకు మెత్తటి తేమ కలిగిన నేలలు, తక్కువ ఉష్ణోగ్రతలు చాలా అవసరం. ఇలాంటి స్థితి వర్షాకాలం తరువాత ఉంటుంది కాబట్టి అప్పుడే అవి పెద్ద ఎత్తున పుట్టుకొస్తాయి. ఇదండి పిల్లలూ.. పుట్టగొడుగుల కథాకమామీషు... ఎన్నో పోషకాలు కలిగిన వీటితో వంటకాలు తయారు చేసి పెట్టమని ఇంట్లో అమ్మను తప్పకుండా అడుగుతారు కదూ...!!