వందేమాతరం... వందేమాతరం
సుజలాం... సుఫలాం
మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం
వందేమాతరం
అంటూ కోటిగొంతులు ఒక్కటై దిక్కులు పిక్కటిల్లేలా చేసే ఒక్క నినాదం తెల్లదొరలను గడగడలాడించింది. భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశ ప్రజలను ఒక్కతాటిపై నిలిపిన సాధనం, స్వాతంత్ర్యోద్యమకారుల చేతిలో పదునైన ఆయుధం ఈ గీతం. ఇదే నేటి మన భారత జాతీయ గేయం.ఈ గీతం ప్రముఖ బెంగాలీ కవి, వ్యాస రచయిత మరియు సంపాదకుడు అయిన బంకించంద్ర ఛటోపాధ్యాయ కలం నుంచి జాలువారింది. ఈయన జూన్ 26, 1838వ సంవత్సరంలో జన్మించారు. ఇంతటి గొప్ప జాతీయ గీతాన్ని భారత ప్రజలకు తరిగిపోని ఆస్తిగా అందించిన ఛటోపాధ్యాయ జన్మదినాన్ని చరిత్రలో జూన్ 26వ తేదీ ప్రత్యేకతగా చెప్పవచ్చు.గుండె గుండెను తట్టిలేపిన గీతమిది..! |
|
ఏ దేశభక్తుడిని పోలీసులు అరెస్టు చేసినా.. తెల్లవారి దురహంకారం ఎక్కడ లాఠీలను, తుపాకులను ఝళిపించినా అక్కడంతా ‘‘వందేమాతరం’’ మార్మోగింది. బెంగాల్ సరిహద్దులు దాటి అఖండ భారత మొత్తం దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది. |
|
|
ఛటోపాధ్యాయ.. తను రాసిన "ఆనంద్ మఠ్" అనే నవల నుంచి వందేమాతరం గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం అహింసాయుత భారత స్వాతంత్ర్య సంగ్రామంలో దేశభక్తిని ప్రబోధిస్తూ ఒక సమరశంఖంలాగా పనిచేస్తూ జన హృదయాలకు చేరువైంది. స్వాతంత్ర్య కాంక్ష రగిలించేందుకు, దేశభక్తిని ప్రేరేపించేందుకు ఇది బాగా దోహదపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం ఈ వందేమాతరం గీతాన్ని జాతీయ గేయంగా స్వీకరించింది.
1870 ప్రాంతంలో బ్రిటీష్ పాలకులు వారి జాతీయ గీతాన్ని భారతీయులపై రుద్దేందుకు ప్రయత్నించారు. దీనిని ప్రజలు తీవ్రంగా అడ్డుకున్నారు. అప్పుడే బంకించంద్ర వందేమాతరం పాటకు రూపకల్పన చేశారు. ఇందులోని పదాలు కష్టంగా ఉన్నాయని... బెంగాలీ, హిందీ, సంస్కృతం మిళితమైందని విమర్శలు వచ్చాయి. బంకించంద్ర మిత్రులు, కూతురు కూడా ఇలాగే స్పందించినా... ప్రజలు మాత్రం ఈ గేయాన్ని ఆదరించారు.
బెంగాల్‌లో స్వాతంత్ర్యోద్యమం ఊపందుకొంటున్న తరుణంలో ఆ రాష్ట్రమంతటా భారీయెత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి. వందేమాతరం పాడినవారిని బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించింది. ఆ నిషేధం వందేమాతరానికి మరింత ప్రాచుర్యం తెచ్చిపెట్టింది. 1905లో బెంగాల్ విభజనకు నిరసనగా జరిగిన ఉద్యమంలో ఈ గేయం కీలకపాత్ర వహించింది.
ఏ దేశభక్తుడిని పోలీసులు అరెస్టు చేసినా.. తెల్లవారి దురహంకారం ఎక్కడ లాఠీలను, తుపాకులను ఝళిపించినా అక్కడంతా "వందేమాతరం" మార్మోగింది. బెంగాల్ సరిహద్దులు దాటి అఖండ భారత మొత్తం దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, వారూ వీరని కాదు అందరినోట అది వినిపించింది. అందరి గుండెల్లోనూ అది ధ్వనించింది. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా భారతీయులందర్నీ కదనరంగంలోకి దుమికేలా చేసింది.
ఈ రకంగా జాతిని ఉత్తేజపరచి, ఆసేతు హిమాచలాన్ని నిద్రలేపిన గీతంగా, గుండె గుండెనూ తట్టి సమరానికి సిద్ధంచేసిన గీతంగా, బానిస సంకెళ్లను తెంచుకొని కలసికట్టుగా ముందుకు ఉరకండని సమర భారతీయులందర్నీ ఒక్కటిచేసిన గీతంగా కొనియాడబడింది వందేమాతర గీతం. దేశమంటే మట్టే కాదనీ, మనుషులే కాదనీ, అదొక అనిర్వచనీయ ఆధ్యాత్మిక శక్తి అని, నైతిక బలమనీ, శతాబ్దాల చరిత్ర సాక్షిగా నిలిచిన మానవకోటి మందిరమని, జాతి జనుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలనీ తెలిపి, కలిపిన గీతమిది.
అన్నట్టు ఈ వందేమాతర గీతాన్ని మొదటగా ఆలాపించింది మన జాతీయ గీతం రచించిన రవీంద్రనాథ్ టాగూరే కావడం విశేషంగా చెప్పవచ్చు. ఆయన ఈ గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో గానం చేశారు. వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ నాయకురాలు సుచేతా కృపలానీ కూడా దీనిని పాడారు.
ఇక రచయిత్రి సరళాదేవి చందురాణి 1905లో జరిగిన బెంగాల్ కాంగ్రెస్ సమావేశంలో వందేమాతర గీతాన్ని పాడి సభికులను ఉర్రూతలూగించారు. అలాగే, ‘వందేమాతరం’ పేరుతో జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతి రాయ్ లాహోర్ నుంచి జర్నల్‌ను ప్రారంభించారు. ఈ గేయాన్ని శ్రీఅరబిందో ఆంగ్లంలో, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి తమిళంలో అనువదించారు.
మాతృభూమిపై ప్రేమ కురిపించే చక్కటి సాహిత్యం, పరాయి పాలనను నిరసించే పదునైన పదాలు... వందేమాతర గీతం ప్రత్యేకత. ఈ గీతానికి ఎంతో చారిత్రక, సంప్రదాయ నేపథ్యం ఉంది. ఈ పాట స్వాతంత్ర్యోద్యమాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తూ, జాతీయ గీతాలకు ప్రేరణగా నిలిచింది. "వందేమాతరం భారత జాతికి బెంగాల్ సమర్పించిన విలువైన కానుకల్లో ఒకటి" అని మహాత్ముడే వ్యాఖ్యానించారంటే, ఈ గీతానికున్న విలువ ఏపాటిదో అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే... బ్రిటీష్‌వారు "ఛటోపాధ్యాయ" పేరును సరిగా పలకలేక "ఛటర్జీ" అని పిలువసాగారు. ఇక అప్పటినుంచి ప్రజలందరూ కూడా బ్రిటీష్ వారిని అనుకరిస్తూ ఆయనను ఛటర్జీ అనే పిలవడం ప్రారంభించడంతో, ఆయన బంకించంద్ర ఛటర్జీగానే కొనసాగారు. తాను రాసిన వందేమాతర గీతంతో జాతి మొత్తాన్ని ఏకం చేసిన బంకించంద్ర చటర్జీ, 1894వ సంవత్సరం ఏఫ్రిల్ 8వ తేదీన కాలధర్మం చెందారు.