అంతరిక్షంలో ధ్వని ఎందుకు వినిపించదు?
, మంగళవారం, 11 అక్టోబరు 2011 (14:11 IST)
కార్టూన్ చిత్రాల్లో, సినిమాల్లో గ్రహాంతర వాసులతో హీరోలు విమానాలతో, అంతరిక్షంలో యుద్ధం చేయడం మీరు చూస్తుంటారు కదూ. నిజానికి అంతరిక్షంలో శబ్దం వినిపించడం అనేది పూర్తిగా అబద్ధం. అంతరిక్ష యుద్ధాలను పక్కన బెడితే మీరు మాట్లాడే మాటలు కూడా అంతరిక్షంలో మీకు వినిపించవు. ఎందుకంటే అంతరిక్షంలో ఉండేది శూన్యం.శబ్ద తరంగాలు ప్రవహించడానికి గాలి అక్కడ లేదు. కనుక ఉపగ్రహాలు లేదా ఉల్కలు ఢీకొన్నా, నక్షత్రాలు పేలినా వినిపించదు. అందుకే అంతరిక్షం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. అయినప్పటికి ఎంతో కొంత పేలుళ్లు వినిపించడానికి అవకాశం లేకపోలేదు. ఏవైనా భారీ ఉపగ్రహాలు ఢీకొన్నప్పుడు వాయువులు వెలువడితే ఆ వాయువుల ద్వారా శబ్ద తరంగాలు ప్రవహించి శబ్దం ఏర్పడుతుంది. కానీ ఆ వాయువులు కొన్ని క్షణాల్లోనే అంతరిక్షంలో విస్తరించిపోతాయి కనుక ఆ శబ్దం కొన్ని క్షణాలే వినిపిస్తుంది.ఐతే శబ్ద తరంగాలు గాలి కంటే ద్రవంలో వేగంగా, ద్రవపదార్థం కంటే ఘన పదార్థంలో మరింత వేగంగా ప్రవహిస్తాయి కనుక వివిధ పరిణామాల బట్టి అంతరిక్షంలో అప్పుడప్పుడూ శబ్దాలు వినిపిస్తుంటాయి. మరి తమ మాటలే తమకు వినబడని వ్యోమగాములకు ఇతర వ్యోమగాముల మాటలు ఎలా వినిపిస్తాయో తెలుసా? వారి మాటలు ఒకరి నుండి మరొకరికి రేడియో తరంగాల ద్వారా ప్రవహించినప్పుడు అవి శబ్ద తరంగాలుగా మారుతాయన్నమాట. విచిత్రంగా లేదూ?