మిథున రాశిలో జన్మించిన జాతకులు వాక్చాతుర్యత, పాండిత్యము కలవారుగా ఉంటారు. ఈ రాశ్యాధిపతి బుధుడు కావడంతో... వీరు జాతిపచ్చ రత్నమును ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జాతిపచ్చను ధరించడం ద్వారా జాతకుల కామ, క్రోధ వికారాలను తగ్గించి, శాంతిని సుఖాన్ని కలుగజేస్తుందని వారు అంటున్నారు. అంతేకాకుండా జాతిపచ్చను ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, శరీరములో బలము పెరగడం వంటివి తటస్థిస్తాయని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది.
జాతిపచ్చను ధరించు విధానము:
కుడిచేతికి చిటికెన వ్రేలుకు ధరించడం ద్వారా సుఖ సంతోషాలు కలుగుతాయి. అదేవిధంగా బుధవారం సూర్యోదయ సమయంలో ధరించినట్లైతే కార్యసిద్ధి కలుగుతుంది. బంగారుతో పొదిగించుకుని జాతిపచ్చను ధరించినట్లైతే సకల సౌభాగ్యాలు దరిచేరుతాయని రత్నాల శాస్త్రజ్ఞులు అంటున్నారు.
ఇకపోతే... జాతి పచ్చను ధరించే ముందు దానిని పాలు, గంగాజలముతో శుద్ధి చేసి, బుధ ధ్యాన శ్లోకమును 170 సార్లు పఠించి ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్రం చెబుతోంది. ఇంకా... మిథున రాశికి చెందిన మహిళా జాతకులు జాతిపచ్చ రత్నాలతో చెవులకు రింగులు, మెడలో నెక్లెస్‌లు ధరించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి.