నవగ్రహాలు తొమ్మిది. అలాగే సంఖ్యలు 9. ఈ తొమ్మిదితో మనిషి జీవిత విశేషాలు, వివాహం, వాహనం, ఆరోగ్యమే కాక ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సంఖ్యలు ఎన్ని ఉన్నా అవన్నీ గుణిస్తే తొమ్మిదిలోపు రాగలవు. ఉదాహరణ 20ని తీసుకున్నప్పుడు అందులో "0" కి విలువలేదు. అందువల్ల 2 అవుతుంది. 0 కి తదుపరి వచ్చే సంఖ్యలే లెక్కకు వస్తాయి. కనుక ఎన్ని సంఖ్యలు ఉన్నా మొత్తం తొమ్మిదిలోపే వస్తాయి. ఈ శాస్త్రాన్నే న్యూమరాలజీ లేదంటే సంఖ్యా శాస్త్రం అంటారు.
పెద్ద సంఖ్యలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడినట్లయితే మరలా 9 సంఖ్యలోపు ఏర్పడగదలదు. ఉదా: 10-2-1948 ఉన్నాయనుకోండి. అది 1+0+2+1+9+4+8= 25 అవుతుంది. తిరిగి ఈ రెండు సంఖ్యలను కూడగా 2+5= 7 అవుతుంది. ఇలాగే ఎన్నివేల సంఖ్యలు కూడినా 9లోపే వస్తాయి.
ఈ శాస్త్రానికి ముఖ్యంగా 9 గ్రహాలు ఉండటం వల్ల మరియు ఎన్నివేల సంఖ్యలను కూడినా 9 లోపు రావటం వల్ల, ఒక్కొక్క సంఖ్య అమర్చబడింది. అంటే రవికి 1వ సంఖ్య, చంద్రునికి 2వ సంఖ్య, గురువుకు 3వ సంఖ్య, రాహువుకు 4, బుధునికి 5, శుక్రునికి 6, కేతువుకు 7, శనికి 8, కుజునికి 9వ సంఖ్య వచ్చింది. సంఖ్యా శాస్త్రం వీటి ఆధారంగానే ఏర్పడింది.
ఈ సంఖ్యా శాస్త్రం ద్వారా మనిషియొక్క భూత, వర్తమాన భవిష్యత్తు కాలమునకు సంబంధించిన గుణగణాలను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి ఏ సంఖ్య కలసి వస్తుంది... వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది... ఇత్యాది అంశాలను తేలికగా గ్రహించవచ్చు.
ఈ శాస్త్రాన్ని మూడు రకాలుగా విభజించారు.
1. జన్మ తేదీని బట్టి చూచుకొను విధానం:
ఈ విధానంలో పుట్టిన సంవత్సరం లేదా నెల కానీ చాలా ముఖ్యం. అంటే 1వ తేదీన జన్మించినవారు 1వ సంఖ్య వారవుతారు. అదేవిధంగా 23వ తేదీన జన్మించినవారు 2+3=5వ సంఖ్యవారవుతారు.
2. జనన తేదీ, నెల, సంవత్సరం:
ఈ మూడింటిని కూడగా వచ్చిన సంఖ్యను, మరలా వాటిని కూడగా వచ్చిన సంఖ్యను బట్టి వారు ఏ సంఖ్యవారో చెప్పవచ్చు. ఉదా: 1953-7-1 తేదీన జన్మించారనుకోండి... అప్పుడు 1+9+5+3+7+1= 26 అవుతుంది. వాటిని మళ్లీ కూడగా 2+6= 8 వస్తుంది కనుక వారు 8వ సంఖ్యవారవుతారు.