పగడం:
శత్రుభయం, రుణబాధ, రోగపీడ, అంగారక దోషం కలిగినవారు, యుద్ధాలలో విజయం కోరేవారు, పిరికితనం గలవారు పగడం ధరించవచ్చు. మాంగల్యబలం కోసం మహిళలు, మంగళరత్నమైన ఈ పగడాన్ని ధరించటం ఒక సాంప్రదాయం. అగ్ని, ఇంధన, అణు, విద్యుత్, యుద్ధ, రక్షణ, భద్రతా శాఖలలో ఉన్నవారు, ప్రమాదకర యంత్ర పరికరాల తయారీలో ఉన్నవారు ఆపదల నివారించేందుకు, అభివృద్థికి పగడాన్ని ధరించవచ్చు.
సోదరులతో సఖ్యతకు, భూవివాదాల పరిష్కారానికి, పుంసత్వానికి రక్తశుద్ధికి, శిరోవ్యాధి నివారణకు, కుజ దోష నివారణకు పగడం ధరించడం మంచిది. అంగారక దశ నడుస్తున్నవారు, దుష్ట స్థానాలలో, దుర్భల రాశులలో కుజగ్రహం ఉండగా జన్మించినవారు కుజుని రత్నమైన పగడం ధరించవచ్చు.
కెంపు:
ఆరోగ్యం, ఉద్యోగం, రాజకీయాధికారం, ప్రమోషన్లు, అధికారుల మెప్పు, పితృసౌఖ్యం, నేత్రరోగం, హృదయరోగ నివారణ మొదలైనవి సూర్య గ్రహ ప్రభావంతో జరిగేవి కనుక వీటికోసం సూర్యరత్నమైన కెంపు ధరించాలి. సూర్యరాశి సింహం కనుక సింహ లగ్నం, సింహరాశిలో జన్మించినవారు కెంపు రత్నాన్ని ధరించవచ్చు. సూర్యుడు దుష్టస్థానాలలో, దుర్భలరాశులలో ఉండగా జన్మించినవారు, సూర్యదశ జరుగుతున్నవారు 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు కూడా కెంపును ధరించవచ్చు.
ముత్యం:
నవరత్నాలలో ముత్యం చంద్రునికి అన్వయిస్తుంది. కర్కాటకం చంద్రుని రాశి. రోహిణి, హస్త, శ్రవణం చంద్రుని లక్షణాలు. 2, 11, 20, 29 తేదీలు చంద్ర దినాలు కాబట్టి కర్కాటకరాశి లగ్నాలలో పైన చెప్పిన నక్షత్రాలలో జన్మించినవారు ముత్యం ధరించవచ్చు.
జనవరి కాలంలో చంద్రుడు దుష్ట స్థానాలలో, దుర్భల రాశులలో ఉండగా జన్మించినవారు, చంద్ర దశ నడుస్తున్నవారు కూడా ముత్యం ధరించవచ్చు. ఉబ్బసం, ఉదరరోగం, స్త్రీల రుతుదోషాలు, శ్వాసరోగాలు, మనోవ్యాధి, చర్మవ్యాధి, వీర్యనష్టం మొదలైనవి తొలగించడానికి ముత్యాన్ని ధరించవచ్చు.
సుఖనిద్ర, సంసార సుఖం, జ్ఞాపకశక్తి, మానసిక ఎదుగుదల, వ్యాపారాభివృద్ధి, వివాహం జరగడంలో అడ్డంకులను తొలగించేందుకు ముత్యం ఉపకరిస్తుంది. నిత్యావసర వస్తువులతో వ్యాపారం చేసే వారికి, పానీయాలు, రస ద్రవాలు, ఫలరసాలు, మందు, వరిపంట, పండ్లతోటలు, హోటళ్ళు, విశ్రాంతి భవనాలు, నీటిపన్నులు, ప్రజలతో నిత్యం సంబంధం గల వృత్తుల్లో గల ఉద్యోగులు ముత్యం ధరించవచ్చునని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది.