Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎల్లలు లేని స్నేహమా..! నీ పయనమెటు..?

ఎల్లలు లేని స్నేహమా..! నీ పయనమెటు..?
WD
'స్నేహం ఎంతో మధురమైనది. స్నేహానికి లింగ, వయో భేదాలు లేవు. ఎన్ని తరాలు మారినా మారనిది స్నేహమే. నేటి తరం యువత రక్తసంబంధం కన్నా స్నేహానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. స్నేహానికి ఎల్లలు లేవన్నది నిజం అంటున్నది నేటి తరం. "సృష్టిలో తీయనిది స్నేహమేనోయి" అన్నారో కవి. నిజమే సృష్టిలో కొన్నిటికి విలువ కట్టలేము. వాటిలో తల్లి ప్రేమ, స్నేహానికి అగ్రస్థానం.

స్నేహం అనేది ఇప్పటి మాట కాదు యుగయుగాలుగా వినిపిస్తున్నదే. హరిహరులు, శ్రీ కృష్ణుడు, కుచేలుడు, సుగ్రీవ - ఆంజనేయులు స్నేహం యొక్క గొప్పదనం చాటినవారే. ఇంకా స్నేహం విలువ తెలిసిన ప్రముఖులు.. స్నేహం మీద ఎన్నో సినిమాలు కూడా తీశారు.

"ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నువ్వే, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా...." ఇది ఒక సినీ కవి కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాట.

ఇంకొకరు "స్నేహమే రా జీవితం స్నేహమే రా శాశ్వతం" అంటూ అద్భుతంగా స్నేహం గురించి గొప్పగా నిర్వచించారు. దీనిని బట్టి స్నేహంలోని గొప్పతనాన్ని విభిన్న కోణాల్లో ఎందరో మహానుభావులు స్పృశించారనే చెప్పాలి.

ఇకపోతే.. "ఇలాంటి వారితోనే స్నేహం చేయాలి. అలాంటి వారితో చేయకూడదు" అంటూ ఆంక్షలు పెడుతుంటారు మన పెద్దలు. చెడ్డవారితో స్నేహం చేయటం వల్ల మనం కూడా చెడిపోతాం అంటారు. కాని చెడ్డవారితో స్నేహం చేసి వారిని సక్రమమైన మార్గంలో నడిపించడంలోనే ఉంది మనం స్నేహానికి ఇచ్చే విలువ.

మన మనస్సుకు ఎవరు దగ్గరగా ఉంటారో?, ఎవరి సమక్షంలో మనకి ప్రశాంతత లభిస్తుందో? వారినే మనం స్నేహితులుగా ఎంచుకుంటాం. మనలోని లోపాలని కూడా స్వీకరించి, సరిదిద్దేందుకు ప్రయత్నించే వాడే నిజమైన స్నేహితుడు.

స్నేహానికి కుల మతాలు లేవు, చిన్నా పెద్దా తేడాలు లేవు. ఎవరు ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు. కలం స్నేహం, ఇంటర్నెట్ స్నేహం, ఫోను స్నేహం... అంటూ మార్గాలు ఎన్నున్నా గమ్యం మాత్రం ఒకటే. బాల్యంలో మొదలైన స్నేహబంధం కడదాకా నిలిచి ఉన్న సందర్భాలు ఎన్నో..!

స్నేహితులు లేని వాడు పేదవానితో సమానం. స్నేహితులే అసలైన ధనం. మనకి ధైర్యాన్ని ఇచ్చేది.. సంతోషాన్ని ఇచ్చేది స్నేహితులే. మొత్తానికి ఎంతమంది స్నేహితులు ఉన్నారు అనేది కాదు ముఖ్యం. ఎంతమంది మనస్సుకి దగ్గరైన స్నేహితులు ఉన్నారనే చాలా ముఖ్యం.

Share this Story:

Follow Webdunia telugu