ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువునకు చెందిన పుట్ట గురుమార్తి అనే మాజీ ఆర్మీ ఉద్యోగి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేయడమే కాకుండా, మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్‌లో ఉగకబెట్టాడు. ఎముకలను పిండి చేశాడు. ఈ కిరాతక హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై స్థానిక పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఎలాంటి క్లూస్ లభించడం లేదు. నిందితుడు చెప్పినట్టు మృతదేహాల ముక్కల కోసం గాలించినా ఒక్కటంటే ఒక్కటి ఆధారం కూడా లభించలేదు. దీంతో ఈ హత్య కేసును ఛేదించలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. పైగా, ఈ హత్య చేసేందుకు గురుమూర్తికి మరో ముగ్గురు సహకరించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ ముగ్గురు ఎవరన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది.
కాగా, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో సుబేదార్‌గా పని చేసి పదవీ విరమణపొందారు. ప్రస్తుతం కంచన్ బాగ్ డీఆర్‌డీలో కాంట్రాక్ట్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపైనే భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యను చంపాలని ప్లాన్ చేసి పక్కా పథకం ప్రకారం చంపేశాడు.
మరోవైపు, నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్టు చెబుతున్నా.. అక్కడ ఒక్క ఆధారం కూడా లభించలేదు. శరీర ఆనవాళ్లు లభ్యమైనా మృతురాలు వెంకట మాధవి పిల్లల డీఎన్ఏతో పోల్చే అవకాశం ఉంది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకంకానుంది. వెంకట మాధవి అదృశ్యంపై కేసు నమోదు చేశామని, ఆమె ఇంట్లోకి వెళుతున్న దృశ్యాలు మాత్రమే లభ్యమైనట్టు పోలీసులు వెల్లడించారు. గురుమూర్తి ఒక ఉన్మాదిలా మారి 70 సార్లు కత్తితో పొడిచి భార్యను చంపేశాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.