Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

తెరాసకి 2020 ఆ రుచి కూడా చూపించబోతోంది, మరి 2021లో ఎలా వుంటుందో?

Advertiesment
2020 Flashback
, బుధవారం, 16 డిశెంబరు 2020 (15:52 IST)
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత తెలంగాణలో తెరాసకు ఎదురే లేదు. కానీ 2020 మాత్రం ఆ పార్టీకి ఒక రకంగా చుక్కలు చూపించిందనే చెప్పాలి. ఏ ఎన్నిక జరిగినా నాదే గెలుపు అనే ధీమాకు గండికొట్టింది కమల దళం. దాంతో 2020 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రం చేదు గుళికను మింగించిందనే చెప్పుకోవాలి.
 
వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత తెరాసకి ప్రధాన ప్రత్యర్థిగా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగిలింది. తెలుగుదేశం, భాజపా వున్నప్పటికీ అవి నామమాత్రపు సీట్లతో సర్దుకుంటూ వచ్చాయి. 2016 ఎన్నికల తర్వాత అసలు తెదేపా, కాంగ్రెస్ పార్టీలను దాదాపు భూస్థాపితం చేసేశారు తెరాస చీఫ్ కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరైనా వచ్చినవారిని వచ్చినట్లు పార్టీలో చేర్చుకున్నారు. ఇక్కడే ఆయన పప్పులో కాలేశారని అంటున్నారు విశ్లేషకులు.
 
ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయడం మూలంగా ప్రజలు తమ అసంతృప్తిని మరో పార్టీ ద్వారా తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుసగా భాజపాకు వస్తున్న విజయాలకు అదే కారణం. మొన్న దుబ్బాకలో షాకిచ్చిన భాజపా తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏకంగా అధికార తెరాసకి సవాల్ విసిరింది. దాదాపు తెరాసకి వణుకు పుట్టించింది.
webdunia
కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోవడం, తెదేపా నామరూపాల్లేకుండా పోవడంతో తెరాస ప్రధాన ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. ఇదే మొన్నటి జిహెచ్ఎంసి ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతోంది. మరోవైపు వైసిపి చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ దోస్తీ కారణంగా తెలంగాణలోని తెదేపా మద్దతుదార్లు భాజపా వైపు మళ్లినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఎంఐఎం పార్టీతో బలమైన స్నేహాన్ని కొనసాగిస్తుండటంతో హిందువుల ఓటు బ్యాంక్ కొద్దోగొప్పో భాజపా వైపు దృష్టి సారించడం వల్ల జిహెచ్ఎంసిలో ఆ ప్రభావం కనబడిందంటున్నారు.
 
ఇక తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా తెరాసకి ప్రధాన ప్రత్యర్థిగా భాజపా అనడంలో సందేహంలేదు. ఇది 2020లో తెరాసకి ఎదురు వచ్చిన చాలెంజ్. ఇంకోవైపు త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగబోతోంది. ఇటీవలే నోముల నర్సింహయ్య మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి వుంది. నిజానికి అక్కడ భాజపాకి పట్టు లేదు. కానీ ఇప్పటికే అక్కడ ఆ పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
webdunia
కాంగ్రెస్ పార్టీలోని నాయకులు చాలామంది నైరాశ్యంతో వున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీతో లాభం లేదని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు భోగట్టా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు నియోజకవర్గంలో మంచి పట్టు వుంది. ఈ నేపధ్యంలో వారిని అక్కడి నుంచి పోటీ చేయించాలని భాజపా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు తెరాస మంత్రి ఎర్రబెల్లి సోదరుడు భాజపా తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. అసలు తెరాసలో చేరడమే కానీ ఆ పార్టీ నుంచి వెళ్లడం ఇప్పటివరకూ లేదు. కానీ 2020 మాత్రం ఆ రుచి కూడా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన అమెరికా.. ఎందుకు.. ఏ విషయంలో?