Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్క శాతం సంపన్నుల గుప్పిట్లో 58 శాతం సంపద.. మేరా భారత్ మహాన్..

ప్రపంచంలోనే అత్యధిక శాతం ఆర్ధిక వ్యత్యాసాల దేశంగా భారత్ రికార్డుకెక్కింది. దేశ మొత్తం సంపదలో 58 శాతం సంపద ఒక్క శాతం సంపన్నుల గుప్పిట్లో చిక్కుకుపోయిందని తాజా సర్వే చెబుతోంది.

ఒక్క శాతం సంపన్నుల గుప్పిట్లో 58 శాతం సంపద.. మేరా భారత్ మహాన్..
హైదరాబాద్ , మంగళవారం, 17 జనవరి 2017 (04:18 IST)
ఒకవైపు మంగళవారం నుంచి దావోస్ సదస్సులో పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమానతల గురించి లెక్చర్లు దంచడానికి ప్రపంచ నేతలంతా చేరిపోయారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక శాతం ఆర్ధిక వ్యత్యాసాల దేశంగా భారత్ రికార్డుకెక్కింది. దేశ మొత్తం సంపదలో 58 శాతం సంపద ఒక్క శాతం సంపన్నుల గుప్పిట్లో చిక్కుకుపోయిందని తాజా సర్వే చెబుతోంది. ఇది ప్రపంచ సగటు (50శాతం) కంటే ఎక్కువేనట.
 
స్విట్జర్లండ్ లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో రైట్ గ్రూప్స్ ఆక్స్‌పామ్ సంస్థ నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. భారత్ లోని 57 మంది బిలియనీర్ల చేతిలో 216 బిలియన్ డాలర్ల సంపద పోగుపడిందని, ఇది దేశంలోని 70 శాతం జనాభా సంపద కంటే ఎక్కువని సర్వే తేల్చింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కేవలం 8 మంది బిలియనీర్ల చేతుల్లో ప్రపంచ జనాభాలోని 50శాతం మంది సంపదకు సమానమైన ధనరాశులు పోగుపడి ఉన్నాయట. భారత్‌లో 84 మంది బిలియనీర్లు మొత్తం 248 బిలియన్ డాలర్ల సంపదను ఉమ్మడిగా కలిగి ఉన్నారు. తొలి మూడు స్థానాల్లో ముఖేష్ అంబానీ (19.3 బిలియన్ డాలర్లు), దిలీప్ సంఘీ (16.7 బిలియన్లు), అజీమ్ ప్రేమ్ జీ (15 బిలియన్లు)  ఉన్నారని సర్వే తెలిపింది. 
 
భారత దేశ మొత్తం సంపద 3.1 ట్రిలియన్ డాలర్లు కాగా, ప్రపంచ మొత్తం సంపద ఈ సంవత్సరానికి 255.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనిలో 6.5 ట్రిలియన్ డాలర్లు బిలియనీర్ల హస్తగతమయ్యాయి. దీనిలో బిల్ గేట్స్ (75 బిలియన్ డాలర్లు), అమేనికో ఆర్టెగో (67 బిలియన్ డాలర్లు) వారెన్ బఫెట్ (60.8 బిలియన్ డాలర్లు)తో తొలి మూడు స్థానాల్లో ఉన్నారని సర్వే తెలిపింది.
 
రాబోయే 20 ఏళ్లలో 500 మంది బిలియనీర్లు తమ వారసులకు 2.1 ట్రిలియన్ డాలర్లను పంచిపెట్టనున్నారని, ఇది 1.3 బిలియన్ ప్రజలున్న భారత్ జీడీపీతో సమానమైన మొత్తమని ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. వాస్తవాలు ఇవి కాగా, ప్రపంచ సంపదల్లో అగ్రభాగాన్ని తమ బొక్కసంలో వేసుకున్న సంపన్నులు దావోస్ సదస్సులో ఎవరిని ఉద్దరించనున్నారన్నది అసలు సమస్య.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిండా ముంచిన అమర్‌సింగ్ మళ్లీ విదేశీబాట