ఇండేన్ గ్యాస్ వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతినెలా గ్యాస్ బండ కోసం బుకింగ్ చేసుకునే సమయంలో పొరపాటున లేదా ఏమరపాటుతో జీరో నొక్కినట్టయితే సబ్సీడీ వదులుకున్నట్టే. ఆ తర్వాత ఒక యేడాది పాటు మీరు అరిచిగీపెట్టుకున్నా తిరిగి సబ్సీడీతో రాయితీని పొందలేరు.
"రండి. GiveItUpలో భాగస్వామ్యం కండి.. మీరు భరించే శక్తి ఉంటే తక్షణమే గ్యాస్ సబ్సిడీ వదులుకోండి.. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవడానికి ముందుకు వస్తే.. ఇలా ప్రభుత్వానికి మిగిలే ప్రతి పైసాను పేదల వంటింట్లో ఖర్చు పెట్టేలా చేస్తాను". ఇదీ గ్యాస్ రాయితీ వదులుకునే అంశంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు.. సబ్సిడీ అనేది అల్పదాయవర్గాలకు మాత్రమేనని, కానీ ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు, ఇందులో అత్యధికంగా ధనికులు సబ్సిడీ పొందుతున్నారని భావించిన చమురు కంపెనీలు, కేంద్రం ఇటీవల రాయితీ వదులుకునే విషయంపై విస్తృతంగా ప్రచారం చేపట్టింది. మోడీ ఇచ్చిన పిలుపునకు సంపన్నకుటుంబాల వినియోగదారులు స్పందిస్తున్నారు.
ఈ ప్రచారానికి మరోవైపు ఆయిల్ కంపెనీలు దొంగదెబ్బ తీసేందుకు సిద్ధపడ్డాయి. రాయితీ వదులుకునే అంశంలో విస్తృతస్థాయిలో ప్రచారం చేసే కార్యక్రమాలు చేయాల్సింది పోయి.. మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం ముసుగులో అసలు సిసలైన అర్హులను ఈ సబ్సిడీ నుంచి ఉద్దేశ్యపూర్వకంగా దూరం చేస్తోంది. గ్యాస్ బండ కోసం బుకింగ్ చేసుకునే క్రమంలో ఇచ్చే ఆఫ్షన్లలో వినియోగదారుడు కొంచెం ఏమరపాటుతో 0 (సున్నా) బటన్ నొక్కితే చాలు ఏడాది పాటు గ్యాస్ సబ్సిడీ పోయినట్టే.
పొరపాటున 0 బటన్ ప్రెస్ అయితే.. ఇక అంతే వెంటనే గ్యాస్ సబ్సిడీ వదులుకున్నట్లు మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఇండేన్ గ్యాస్ కంపెనీని సంప్రదించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇతర ఆయిల్ కంపెనీలతో పోల్చితే.. ఒక్క ఇండేన్ గ్యాస్ ఆఫ్షన్ మాత్రమే ఈ తరహా ప్రమాదానికి కారణంగా ఉంది. అందుకే ఇండేన్ గ్యాస్ వినియోగదారులంతా బుకింగ్‌లో ఆప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.