అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేస్తున్న గీతా గోపీనాథ్ ఆగస్టులో తన పదవి నుంచి వైదొలగనున్నారు. పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆమె తిరిగి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరనున్నారని ఐఎంఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా... గోపీనాథ్ నిష్క్రమణను ధ్రువీకరించారు. ఆమె తర్వాత ఆ పదవి చేపట్టే వ్యక్తిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
కాగా, గోపీనాథ్ మొదట 2019లో చీఫ్ ఎకనామిస్ట్‌గా ఐఎంఎఫ్‌లో చేరారు. ఆ పదవిని నిర్వహించిన మొదటి మహిళగా నిలిచారు. కరోనా మహమ్మారి, దాని ఫలితంగా ఏర్పడిన స్థూల ఆర్థిక అంతరాయాలతో సహా అసాధారణ ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆమె నాయకత్వ పటిమకు మంచి గుర్తింపు పొందారు.
2022 జనవరిలో ఆమెకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. గోపీనాథ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఐఎంఎఫ్‌లో తన ఏడేళ్ల పదవీకాలాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక సంస్థలలో ఒకదానిలో సేవ చేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు.