Publish Date: Mon, 07 Jul 2014 (17:04 IST)
Updated Date: Mon, 07 Jul 2014 (17:09 IST)
మేక, కోడి మాంసం, చేపలు, రొయ్యల ధరలు పెరిగిపోవడంతో ముక్కలేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రియుల జిహ్వకు గడ్డుకాలం దాపురించింది. మేక మాంసం ధర కేజీ రూ. 400 వరకు పెరిగిపోవడంతో సామాన్యులు వంద గ్రాముల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. కోడి బ్రాయిలర్ లైవ్ కేజీ రూ.100 ఉండగా, మాంసం కేజీ రూ.200 వరకు చేరింది. గ్రామీణులు ఎక్కువగా తినే లేయర్ కోడి లైవ్ ధర కేజీ రూ.74 ఉండగా, మాంసం ధర రూ.150 కు పెరిగింది.
కోడిగుడ్డు చిల్లర ధర రూ.4.50. చేపలు, రొయ్యల ధరలూ భారీగానే ఉన్నాయి. గత నెలలో ఉభయ గోదావరి జిల్లాల్లో చెరువుల్లో పెద్ద ఎత్తున చేపలు చనిపోతే కేజీ రూ.ఐదుకు తెగనమ్మారు. ఇప్పుడది రూ.90కి చేరింది. బహిరంగ మార్కెట్‌లో మాత్రం శీలావతి, బొచ్చ చేప, గడ్డిమోసుల కేజీ ధర రూ.140 నుంచి రూ.150 వరకు ఉంది. చందువా, కొర్రమీను కేజీ రూ.300 వరకు పలుకుతున్నాయి. వెనామీ రొయ్యలే కాదు.. సేక (తెల్ల) రొయ్యల ధర సైతం కేజీ రూ.200 నుంచి రూ.220 వరకు ఉంది.
బియ్యం ధర వింటే భయం..
బియ్యం ధరలు బహిరంగ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. సన్నరకాల ధరలు గత రెండు నెలల్లో కేజీకి బ్రాండ్‌ను బట్టి కేజీకి రూ.ఐదు నుంచి రూ.ఏడు వరకు పెరిగాయి. నెల రోజుల క్రితం రూ.45 వరకు ఉన్న గిద్దమసూరి(రారైస్) కేజీ రూ.50 నుంచి రూ.52 వరకు పెరిగింది. గిద్దమసూరు స్టీమ్ రకాలను చాలా కంపెనీలు భారీగా పెంచివేశాయి. రూ.33 ఉన్న స్టీమ్ రకం ధరలు రూ.41 నుంచి రూ.46 వరకు పెరిగాయి. గిద్దమసూరిలోని పండారు రకాలు రూ.34 వరకు ఉంది. సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే స్వర్ణ బియ్యం ధర సైతం పెరిగింది. ధాన్యానికి డిమాండ్ ఏర్పడిందనే వంకతో కేజీ రూ.24 ఉన్న ధరను రూ.26 వరకు పెంచారు. బస్తాకు రూ.50 వరకు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.