కొన్నేళ్లుగా దేశీయ విమానయాన రంగం సంక్షోభాలను చవిచూస్తోంది. దేశంలో కొత్తగా ఎయిర్‌లైన్స్ నడిపేందుకు పారిశ్రామికవేత్తలు అనుమతులు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్వీసులు అందిస్తున్న కంపెనీలు మాత్రం సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయి. దేశీయ విమానయానరంగంలో చిత్రవిచిత్ర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యానికి పైలట్లు హెచ్చరికలు పంపారు.
కింగ్‌ఫిషర్ సంస్థ అప్పుల పాలైన తర్వాత మిగతా కంపెనీలు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నా నష్టాలు తప్పడం లేదు. ఇండిగో వంటి ఒకటి రెండు కంపెనీలు మినహా ఎయిరిండియా సహా అన్నీ సంస్థలు నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. ఇటీవల స్పైస్‌జెట్ సంస్థ పీకల్లోతు కష్టాల్లో పడినట్టు వార్తలొచ్చాయి.
ఉద్యోగులకు ఫామ్ 16 కూడా ఇవ్వకపోవడంపై భిన్న కథనాలు వెలువడ్డాయి. కింగ్‌ఫిషర్ బాటలోనే స్పైస్‌జెట్ ఉందని.. త్వరలోనే మూతపడడం ఖాయమని జాతీయ అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. మేనేజ్‌మెంట్ మాత్రం నష్టాల మాట వాస్తవమే అయినా.. మూసివేసేంత దారుణ పరిస్థితులు లేవని ఖండిస్తోంది.
ఆగస్టు 20 వరకూ గడువు
స్పైస్‌జెట్ వ్యవహారం ఇలా ఉంటే.. తాజాగా నరేష్ గోయల్ నేతృత్వంలోని జెట్ ఎయిర్‌వేస్ పైలెట్లు కూడా కంపెనీకి అల్టిమేటమ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 11 వందల మంది పైలెట్లు ఉన్న ఈ ఏవియేషన్ సంస్థలో అంతర్గత ముసలం మొదలైనట్టు కథనాల సారాంశం. తమకు రావాల్సిన 100 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పైలెట్లు హెచ్చరించారట. ఆగస్టు 20 వరకూ గడువుచ్చినట్టు తెలుస్తోంది. అయితే తమకు ఉద్యోగుల నుంచి ఎలాంటి హెచ్చరికలు అందలేదని.. జెట్ ఎయిర్ వేస్ అంటోంది.
ఒకవేళ పైలెట్లు సమ్మెకు దిగితే కంపెనీ నష్టాలు ఎదుర్కోక తప్పదు. అదే జరిగితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముంది. తమకు నిధుల కొరత లేదని.. 24 శాతం వాటాను ఎతిహాద్‌కు అమ్మడం ద్వారా 2 వేల కోట్లకు పైగా నిధులను సమకూర్చుకున్నట్టు సంస్థ చెబుతోంది. మరికొద్దిరోజుల్లో ఈ వివాదంపై స్పష్టత వచ్చే అవకాశముంది.
కొంతకాలంగా దేశీయ విమానయాన రంగం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. పెరుగుతున్న లాండింగ్ ఛార్జీలు.. ఆయిల్ ధరలతో అదనపు భారం పడుతోంది. కొత్తగా ఎయిర్‌లైన్స్ కంపెనీలు మార్కెట్‌లోకి రావడంతో ధరల యుధ్దం తెరపైకి వస్తోంది. ఇవన్నీ పాత కంపెనీలకు సవాల్‌గా మారుతున్నాయి. నిర్వహణ భారమవుతోంది. ఆదాయం తగ్గుతోంది. దీంతో కంపెనీలు భారీ నష్టాలు మూటగట్టుకుంటున్నాయి.కొత్తగా రంగంలోకి వచ్చిన ఏయిర్ ఏసియా, ఎయిర్‌కోస్టా సంస్థలు పరిమిత సర్వీసులు.. తక్కువ ఛార్జీలతోనే లాభాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో మరికొంత మంది వీటిని అనుకరిస్తూ ఈ రంగంలో అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కేంద్రంఅనుమతులు ఇవ్వగా.. డీజీసీఏ లైసెన్స్‌ల కోసం ఎదురుచూస్తున్నాయి. పాత కంపెనీలకు ఇది మరింద ఆందోళన రేపుతోంది.
ప్రైవేటీకరణే సంక్షోభాలకు కారణం
విమానయాన సంస్థలు నష్టాల పాలవడానికి ఎయిర్‌పోర్టులు ప్రైవేటీకరణే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఇబ్బడిముబ్బడిగా పెంచిన లాండింగ్ ఫీజుల కారణంగా సంస్థలపై పెనుభారం పడుతోంది. ధరల యుద్ధం కారణంగా ప్రయాణీల నుంచి వసూలుచేయలేకపోతున్నారు. అలాగని సర్వీసులు తగ్గించలేరు. పాత కంపెనీలకు భిన్నంగా కొత్తగా రంగంలో అడుగుపెడుతున్న కంపెనీలు ప్రైవేటు ఎయిర్‌పోర్టులున్న నగరాలకు కాకుండా.. చిన్నచిన్న పట్టణాలకు సర్వీసులు అందిస్తున్నాయి. ప్రైవేటు ఎయిర్‌పోర్టుల ఫీజుల భారంతగ్గించుకుని లాభాలు ఆర్జిస్తున్నాయి. దేశంలోని అన్ని పోర్టులను ప్రభుత్వమే నియంత్రిణ పరిధిలోకి తీసుకొస్తే తమ కష్టాలు కూడా తగ్గుతాయని పాత ఎయిర్‌లైన్స్ సంస్థలంటున్నాయి. అటు ప్రయాణీకులకు భారం తగ్గుతుందంటున్నారు.. కానీ ప్రభుత్వం అవేమీపట్టించుకోవడం లేదు.. పైగా మిగిలిన వాటిని కూడా ప్రైవేటు చేతికి అప్పగిస్తోంది. ఎయిర్‌లైన్స్ కష్టాలు మరింత పెంచుతోంది.