Publish Date: Fri, 06 Jun 2014 (17:53 IST)
Updated Date: Fri, 06 Jun 2014 (17:57 IST)
ఈ వ్రతం జ్యేష్ఠ పూర్ణమనాడు ఆచరిస్తాడు. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజునే ప్రదోషకాలంలో (రజనీముఖం) ఆరంభిస్తారు. కొందరు జ్యేష్ఠ అమావాస్యకు చేస్తారు. స్త్రీలు ఐదవతనాన్ని గొప్పవరంగా భావిస్తారు. ఐదవతనాన్ని కాపాడుకోవడానికి అనేక వ్రతాలు, పూజలు చేస్తారు. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, వటసావిత్రి వ్రతం వంటివి విశేషమైనవి. వీటిలో వటసావిత్రి వ్రతానికో ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని వటవృక్షాన్ని పూజచేయడం ద్వారా జరుపుకుంటారు.
వటవృక్షం అనగా మర్రిచెట్టు. భారతీయుల జాతి వృక్షం. మర్రిచెట్టును త్రిమూర్తుల సంయుక్త స్వరూపంగా భావిస్తారు. మర్రిచెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు కొమ్మలు శివునికి నివాసస్థలాలు. ఈ వ్రతం రోజు సుమంగళులు వటవృక్షాన్ని పసుపు, కుంకుమలతో, అక్షతలతో పూజిస్తారు. వటవృక్షాన్ని పువ్వులతో అలంకరించి, గాజులు మొదలైన అలంకరణ సామాగ్రిని సమర్పించి ధూప, దీప, నైవేద్యాలతో పూజిస్తారు.
తరువాత వటవృక్షం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసేటప్పుడు ముడిప్రత్తి నుండి వడికి తీసిన దారాన్ని వృక్షం చుట్టూ చుట్టుకుంటూ వెళ్తారు. వటవృక్షం యొక్క దీర్ఘాయుర్దాయంతో తమ భర్తల ఆయుష్షును బంధించడమే ఇలా దారం చుట్టడంలోని అంతరార్థంగా కన్పిస్తుంది.
జనన మరణాలు కాలం మీద ఆధారపడి వుంటాయి. కాబట్టి కాలాన్ని బంధించే భావనతో ఇలా దారాన్ని చుట్టడం జరుగుతోందని కూడా అనుకోవచ్చు. పూజ పూర్తయ్యాక ప్రతి స్త్రీ, ఐదుగురు సుమంగళుల నొసట బొట్టు పెట్టి గౌరవిస్తుంది. సౌభాగ్యం, సంతానవృద్ధి, సిరి సంపదల కోసం వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు.