తెలుగు పంచాంగం ప్రకారం జులై 25, శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమయ్యింది. ఈ లెక్కన చూస్తే జులై 29 తొలి మంగళవారం అవుతుంది. శ్రావణంలో వచ్చే అన్ని మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. శ్రావణ మంగళ గౌరీ వ్రతం ముఖ్యంగా కొత్తగా పెళ్లైన అమ్మాయిలు దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం ఆ సర్వమంగళా దేవి అయిన పార్వతీ దేవిని ప్రార్ధిస్తూ చేసే నోము. ఈ వ్రతం చేయడం వల్ల కలకాలం సువాసినులుగా ఉంటారని ప్రతీతి.
సాక్షాత్తు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతం గురించి చెప్పినట్లుగా నారద పురాణం చెప్తోంది. మంగళ గౌరీని పూజించిన తర్వాత అనంతరం వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. మంగళగౌరి వ్రత కథను చదువుకునేటప్పుడు ఒక అట్లకాడకు ఆవు నెయ్యి పూసి దీపారాధన మీద ఉంచి కాటుక పారేలాగా చేయాలి.
ఈ కాటుకను అమ్మవారికి పెట్టి, అనంతరం పూజ చేసిన వారు పెట్టుకోవాలి. తర్వాత వాయనం ఇచ్చే ముత్తైదువులకు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. మంగళ గౌరీ పూజలో ముత్తైదువులకు ఇచ్చే వాయనాలకు చాలా ప్రాధాన్యత ఉంది. కొత్తగా పెళ్ళైన నూతన వధువులు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని 5 సంవత్సరాలపాటు నిరంతరాయంగా చేయాల్సి ఉంటుంది.