Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగాది వెనుక అసలు కథ ఏమిటి? ఉగాది పచ్చడిని తింటూ పఠించాల్సిన శ్లోకం?

ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరంగా మాత్రమే తెలిసిన నేటి తరానికి ఆ పండుగ వెనుక ఉన్న అసలు కథను తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. హిందూ పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడు. అలాగే మత్స్య అవతారం ధరించిన విష్ణువు వ

ఉగాది వెనుక అసలు కథ ఏమిటి? ఉగాది పచ్చడిని తింటూ పఠించాల్సిన శ్లోకం?
, మంగళవారం, 28 మార్చి 2017 (19:35 IST)
ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరంగా మాత్రమే తెలిసిన నేటి తరానికి ఆ పండుగ వెనుక ఉన్న అసలు కథను తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. హిందూ పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడు. అలాగే మత్స్య అవతారం ధరించిన విష్ణువు వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చింది అని కూడా అంటారు. అన్ని ఋతువుల్లో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కనుక, కొత్త జీవితం నాందికి గుర్తుగా ఉగాది పండుగను చేసుకుంటారు. 
 
ఉగాదినే కొన్ని ప్రాంతాల్లో యుగాది అని కూడా అంటారు. కొందరు తెలుగువారే యుగ+ఆది (అంటే యుగం యొక్క ప్రారంభం) అని దాన్నే యుగాది లేదా ఉగాది అని అంటారని పొరబడుతుంటారు. కానీ ఉగాది అంటే అసలు అర్థం అది కాదు. 
 
ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ప్రారంభం కాబట్టే ఉగ+ఆది = ఉగాది అయ్యింది. అంటే సృష్టి ఆరంభమైన రోజునే ఉగాది అంటారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడు ఉగాదిని జరుపుకోవాలి. 
 
ఉగాది రోజున తలంటు స్నానం చేసి, కొత్త సంవత్సరాది స్తోత్రాన్ని పఠించి, ఉగాది పచ్చడి సేవించి, ధ్వజారోహణం (అంటే పూర్ణకుంభదానం) చేసి, ఆపై పంచాంగ శ్రవణంతో పంచకృత్య నిర్వహణ చేయాలి. ఉగాది రోజున ప్రత్యేకంగా ఏ దేవుడికి పూజ చేయాలో ఏ గ్రంథాల్లోనూ, పురాణాల్లోనూ పేర్కొననందున మీకు ఇష్టమైన దేవుడిని కొలుచుకోవచ్చు. 
 
ఉగాది పచ్చడి ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన పదార్థం. షడ్రుచుల మేళవింపు - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడిని ఉగాది రోజున విధిగా తీసుకోవాలి. సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతుంటారు.
 
 
ఉగాది పచ్చడిని తినేటప్పుడు పఠించవలసిన మంత్రం కూడా ఉంది. అది -
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
 
ఈ పచ్చడిని ఉగాది రోజున మొదలుపెట్టి, శ్రీరామనవమి వరకు ప్రతిరోజూ తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. దీన్ని తీసుకోవడం మూలంగా ఋతువుల్లో మార్పు కారణంగా ఆరోగ్య సమస్యలేవీ రాకుండా ఉంటాయి. 
 
ఇదండీ ఉగాది కథా కమామీషు. ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఉగాదిని మనం మాత్రమే కాదు. దాదాపు దేశంలోని ప్రజలు అందరూ చేసుకుంటారు. కాకుంటే వాళ్లు పెట్టుకున్న పేర్లు వేరే ఉన్నాయనుకోండి. మరాఠీలు ఉగాదిని గుడి పడ్వా అని, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ అనే వివిధ పేర్లతో ఉగాదిని జరుపుకుంటారు. ఇందులో తమిళనాడులో మాత్రమే ఈ పండుగని ఆర్య సంస్కృతికి చిహ్నంగా భావించి, నూతన సంవత్సరాన్ని జనవరిలో వచ్చే సంక్రాంతి సమయంలోనే జరుపుకోవాలి అని చట్టం తెచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగాది రోజున పచ్చడిని తొలిజాములోనే తీసుకోవాలి: పూజ.. ఉదయం 9 గంటల్లోపే పూర్తి చేయాలి.