Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రథ సప్తమి 2021: జిల్లేడు ఆకులను తలపై వుంచుకుని స్నానం చేస్తే...

రథ సప్తమి 2021: జిల్లేడు ఆకులను తలపై వుంచుకుని స్నానం చేస్తే...
, గురువారం, 18 ఫిబ్రవరి 2021 (20:53 IST)
రథ సప్తమి ఫిబ్రవరి 19 గురువారం, 2021. ఈ రోజు ఆచరించాల్సిన నియమాలు ఏమిటో చూద్దాం. వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది. వేదాల్లోని సౌర సూక్తులు, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా. ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు.
 
మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యరథం ఉత్తర దిక్కువైపు తిరుగుతుంది. అందుకే మాఘ శుద్ధ సప్తమి రథ సప్తమి అని పేరు వచ్చింది. రథసప్తమినాటి శిరస్నానంలో జిల్లేడు, రేగు ఆకులను (రేగుపండ్లు కూడా) తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి. మన భారతీయ ఆచారాలు మూఢవిశ్వాసాలు కావు. వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలు నిలిచి వున్నాయి. జిల్లేడు ఆకులకు అర్క పత్రములని పేరు. సూర్యునికి ‘‘అర్కః’’ అని పేరుంది. జిల్లేడులో సూర్యతేజస్సు, సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది. 
 
అందువలన రథ సప్తమినాడు, సప్త అశ్వములకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేస్తారు. రేగి ఆకులలోను, చిక్కుడు ఆకులలోనూ, సూర్యశక్తి నిక్షిప్తంగా ఉంటుంది. రేగి ఆకులను కూడా శిరస్సున ఉంచుకొని, స్నానం చేస్తారు. జిల్లేడు రేగు ఆకులను కలిపి శిరస్సు భుజముల మీద ఉంచి స్నానం చేస్తారు. సప్త అశ్వములే సప్త స్వరములు, సప్త ఛందస్సులు, సప్త ఋషులు రథ సప్తమీ సూర్యారాధన- ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. తల స్నానం ముగించి సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. 
 
రథ సప్తమినాడు స్త్రీలు గుమ్మం ముందు 'రథం ముగ్గును' వేసి మధ్యలో జాజుతొ వర్తులాకారం వేయాలి. ముగ్గు పైన గోమయంతో చేసిన పిడకలు వెలిగించి, దాని పైన మట్టితో చేసిన గురిగిని పెట్టి అందులో ఆవు పాలు పోసి పొంగించాలి. ఆ పాలతో పాయసం చేసి సూర్యుడికి నివేదన చేసి అందరూ స్వీకరించాలి. ఇంట్లో సూర్యుడి పటం ఉంటే ఆ చిత్రపటానికి అలంకరణ చేసి యధాశక్తిగా పూజించాలి.
 
సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం. సూర్యాష్టకం పఠించాలి. సూర్యుడికి గోధుమలతో చేసిన పాయసం నివేదన చేసి అందరూ స్వీకరించాలి. ఈ రోజు సూర్య నమస్కారాలు చేయడం చాలా విశేషం. ఈ రోజున చేసే స్నాన దాన అర్ఘ్యాలు కోటి రెట్లు పుణ్యం ఇస్తుంది. జాతకంలో రవి దశ జరుగుతున్నవారు, జాతకంలో రవి బాగులేని వారు, రోగ బాధలు అనుభవిస్తున్న వారు ఈ రోజున ఎరుపు వస్త్రము చుట్టిన రాగి చెంబులో గోధుమలు పోసి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రథసప్తమి.. ఆదిత్య హృదయం పఠిస్తే.. సూర్యారాధన చేస్తే?