Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్జల ఏకాదశి నాడు నీరు తాగకుండా వ్రతం చేస్తే?

Advertiesment
nirjala ekadasi vrata
నిర్జల ఏకాదశి నాడు నీరు తాగకూడదట! ఏంటిది అనుకుంటున్నారా?అయితే ఈ కథనం చదవండి. ఈ నెల 9(శుక్రవారం) నిర్జల ఏకాదశి వస్తోంది. ఈ నిర్జల ఏకాదశి గురించి తెలుసుకుందామా. ధర్మరాజు ఒకరోజు 'నిర్జల ఏకాదశి' గురించి తెలియజేయాల్సిందిగా వ్యాస మహర్షిని కోరాడు.
 
వ్యాసుడు.. 'జేష్ఠ మాసంలోని రెండు పక్షాలలోని ఏకాదశినాడు భోజనం చేయకు, ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి బ్రాహ్మణ సంతర్పణ చేసి భోజనం చేయమ'ని చెబుతుండగానే ఈ విషయం వినిన భీముడు 'మా తల్లి కుంతి, అన్న ధర్మరాజు, ద్రౌపది, అర్జునుడు, నకుల, సహదేవులంతా కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారు.
 
కానీ నేను మాత్రం ఆకలికి తాళలేక సంవత్సరానికొకమారే ఉపవాసం చేస్తాను. నాకు ఏ వత్రంతో స్వర్గలోక ప్రాప్తి కల్గుతుందో అటువంటి ఏకాదశిని గురించి ఉపదేశించమని ' కోరుతాడు. 
 
వ్యాసులవారు 'ఓ! భీమసేనా! జేష్ఠమాసంలో సూర్యుడు వృషభ రాశి నుండి మిథునరాశిలోకొస్తాడు అప్పుడు శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు కేవలం ఆచమనం తప్ప ఇక ఎటువంటి నీటిని (నిర్జల) తాగకుండా ఉండు. తాగావో వ్రత భంగమవుతుంది. 
 
ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి, బ్రాహ్మణులకు నీటితోపాటు సువర్ణదానం చెయ్యి. తర్వాత జితేంద్రియులైన బ్రాహ్మణులతో కలసి భోజనం చెయ్యి. శ్రీమహావిష్ణువు నాతో 'ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు' అని తెలియజేశాడు.
 
ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాగకుండా వుంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణ ముద్రలు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. నిర్జల ఏకాదశినాడు చేసిన స్నానం దానం, జపం, హోమం, మొదలైనవన్నీ అక్షయమవుతాయని పండితులు అంటున్నారు. 
 
'నిర్జల ఏకాదశి' ని విధి పూర్వకంగా చేసినవారు వైష్ణవపదమును పొందుతారు. నిర్జల ఏకాదశి నాడు అన్నం, వస్త్రం, గోవు, జలం, మంచం, కమండలం, గొడుగు దానం చేయాలి అని వ్యాసుల వారు భీమసేనునికి చెప్పారు.  
 
పూజ ఎలా చేయాలి?
సూర్యోదయానికి ముందే లేవాలి
పూజకు దీపాలంకరణ, పండ్లు, తులసీ ఆకులను వాడాలి
విష్ణు దేవాలయంలో పూజలు, హోమాలు చేయించే మంచి ఫలితం ఉంటుంది. 
నీరు సేవించకుండా వ్రతమాచరించాలి
పాలు, పెరుగు, నెయ్యి,(లేదా వెన్న) తేనె, చక్కెరతో విష్ణుమూర్తికి అభిషేకం చేయించాలి. 
వస్త్రాలు, ధాన్యాలు, గొడుగులు, చేతి విసనకర్రలు, బంగారం దానం చేయాలి. ఆ రోజు రాత్రి జాగరణ చేసి.. మరుసటి రోజు శుచిగా స్నానమాచరించి ఇతరులకు ఆహారం, దుస్తులు, పండ్లు, పాలు వంటివి దానం చేసి నీరు తాగి ఉపవాసాన్ని ముగించుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu