Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

tholi ekadashi 2022 తొలి ఏకాదశిని శ్రీ మహావిష్ణువు అందుకే ఏర్పాటు చేసాడు

Lord Vishnu
, శనివారం, 9 జులై 2022 (22:43 IST)
తొలి ఏకాదశి... పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చేది తొలి ఏకాదశి. ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్ర‌తీతి. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు.


ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అంటారు. సంవత్సరం మొత్తం మీద  24 ఏకాదశులు వ‌స్తాయి. ప్రతి నెలా కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి...  మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి.
 
ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శయనిస్తాడు. అందుకే దీన్ని “శయన ఏకాదశి” అంటారు. పంచ భూతాలు, సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్ప‌వ‌చ్చు.
 
ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షణం వైపున‌కు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించాల‌ని పురాణాలు చెబుతున్నాయి.
 
మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు... దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీసాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
 
ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
 
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తలమునకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.
 
ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశి నాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.
 
తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-07-2022 నుంచి 16-07-2022 వరకు మీ వార రాశి ఫలితాలు