Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుమార షష్ఠి : 3న సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

కుమార షష్ఠి : 3న సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.
, బుధవారం, 2 జులై 2014 (18:01 IST)
పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం-సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా, సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమార స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే స్కంధ పంచమి, కుమార షష్ఠి (జూలై 2,3 గురువారం) రోజున స్వామిని పూజించాలి. కుమార స్వామిని పూజిస్తే గౌరీశంకరుల కటాక్షం మనకు లభించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. 
 
శివపార్వతుల తనయుడైన కుమార స్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించలేకపోవడంతో, ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తికా దేవతలు ఆరుగురు స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున ఆ శిశువును స్కందుడని, రెల్లు గడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని, కృత్తికా దేవతలు పెంచడంతో కార్తీకేయుడని కుమార స్వామిని పిలుస్తారు. 
 
ఇక సుబ్రహ్మణ్యునికి ఉన్న ఆరు ముఖాలకు ప్రత్యేకతలున్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం, పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం, శూరుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం, శరుణు కోరిన వారిని సంరక్షించే ముఖం, శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్పుటమయ్యే ముఖం, లౌకిక సంపదల్ని అందించే ముఖం... ఇలా ఆరు ముఖాల స్వామిగా ఆనంద దాయకుడిగా స్వామి కరుణామయుడిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నాడు. 
 
అందుచేత ఆషాఢ మాస శుక్ల పక్ష పంచమి, షష్ఠి పుణ్య దినాల్లో భక్తులు స్వామిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠి పర్వదినాలుగు జరుపుకుంటారు. స్కంద పంచమినాడు కౌమారికీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా పంచమి నాడు ఉపవాసం ఉండి, షష్ఠి నాడు కుమార స్వామిని పూజించడం ఓ సంప్రదాయంగా వస్తుంది. నాగ దోషాలకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికీ, కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయం. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu