మంగళవారం పూట హనుమాన్ జయంతి.. మారుతిని పూజించండి
నేడు (ఏప్రిల్ 11) హనుమాన్ జయంతి. మంగళవారం పూట వచ్చిన ఈ హనుమాన్ జయంతి రోజున రామనామ జపం చేస్తే అనుకున్న కార్యాలు విజయవంతం అవుతాయి. హనుమాన్ జయంతి రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం
నేడు (ఏప్రిల్ 11) హనుమాన్ జయంతి. మంగళవారం పూట వచ్చిన ఈ హనుమాన్ జయంతి రోజున రామనామ జపం చేస్తే అనుకున్న కార్యాలు విజయవంతం అవుతాయి. హనుమాన్ జయంతి రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు. ఇంకా శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది కాబట్టి ఆ రోజున స్వామివారిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు.
"యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్"
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును" అని అర్థం. అందుకే హనుమాన్ జయంతి రోజుతో పాటు.. ఆంజనేయ స్వామిని శనివారం, మంగళవారం ఇంకా గురువారాల్లో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి.
పూర్వం శనీశ్వరుడు ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆంజనేయ స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏలినాటి శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శనివారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.