అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించడం ఎలాగో తెలుసా!?
అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే సకల సంపదలు చేకూరుతాయి. శ్రీకృష్ణ భగవానుడు అనంత పద్మనాభ వ్రతాన్ని ధర్మరాజుకు వినిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భాద్రపద శుక్ల చతుర్ధశి నాడు (ఈ ఏడాది సెప్టెంబర్-22) శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. పూజామందిరము నందు అష్టదశ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి. పద్మానికి నడుమ దర్భలతో తయారు చేసిన ఏడు పడగలతో ఉన్న అనంత పద్మనాభ స్వామి బొమ్మను పెట్టాలి. దర్భలతో చేసిన ఆ బొమ్మలోకి అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేయాలి. ఎర్రని రంగులో ఉండే 14 ముడులతో ఉన్న తోరాన్ని స్వామి దగ్గర ఉంచాలి. షోడశోపచార పూజ చేయాలని పురోహితులు చెబుతున్నారు. ఇలా పద్మనాభ వ్రతాన్ని ఆచరించే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి.ఇంకా అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించిన భక్తులు ఆ రోజున తమకు వీలైనంత దానధర్మాలు చేయడం ద్వార మోక్షఫలములు, పుణ్యఫలములు, అష్టైశ్వర్యాలు పొందుతారని పురోహితులు సూచిస్తున్నారు.