మీకు మెట్ల కింద నిద్రించే అలవాటుందా..?!
మీ ఇంట్లో మెట్ల కింద స్థలం ఖాళీగా ఉందా..? ఆ స్థలంలో నిద్రిస్తున్నారా? ఐతే ఆ అలవాటును మార్చుకోండని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. మెట్ల కింద నిద్రించడం మంచిదికాదంటున్నారు. మెట్లకు పక్కగా కదిలే ఛీ శక్తిలో సహజంగానే కొద్ది వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెట్లకు దగ్గరగా లేదా క్రిందా, పైనా నిద్రించకూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయి. ఇంకా ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి మెట్లకు ఎదురుగా పడకగది ఉండకూడదు. ఇంటి మధ్య భాగంలో మెట్లు ఉండకూడదు. దీనివల్ల కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం ఉంది. మెట్ల క్రింద ఆక్వేరియం లేదా ఫౌంటేన్‌లను పెట్టకండి. దీనివల్ల మీ పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. ఇకపోతే.. కొన్ని చోట్లలో ముఖ్యంగా అవుట్‌హౌస్‌లలో ఉండే గార్డెన్‌లలో, పార్క్‌ల్లో ఎక్కువ మెలికలు తిరిగిన మెట్లుంటాయి. ఇలాంటివే కొందరు తమ ఇళ్ళల్లో ఆకర్షణీయంగా ఉంటాయని నిర్మించుకుంటారు. దీనివల్ల మనకు లభ్యమవ్వాల్సిన మొత్తం ప్రాణశక్తి అక్కడే నిలిచిపోతుంది. ఫలితంగా పై అంతస్తులో ఉండేవారికి ఎలాంటి వనరులూ లభ్యమయ్యే అవకాశాలుండవు. అయితే గృహంలో కొద్దిగా వంపు తిరిగిన మెట్లుండటం ఎంతో లాభదాయకం. ఎందుకంటే దీనివల్ల చీ శక్తి మరీ ఉధృతంగాను లేదా నెమ్మదిగా ప్రయాణించకుండా, ఒక సరైన పద్ధతిలో కావాల్సినంత రీతిలో సమపాళ్ళలో ఉంటుంది. తద్వారా ఇంటిపై అంతస్తులోని వారు, క్రింది అంతస్తులోని వారు ఇద్దరూ అన్ని విధాలా అభివృద్ధి చెందే ఆస్కారాలు పెరుగుతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.