వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా ఫెంగ్‌షుయ్ చెప్పే కొన్ని సూత్రాలను పాటిస్తే అభివృద్ధి మీ వెంటే ఉంటుందని, వృత్తి పరంగా రాణిస్తారని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మీరు కూర్చునే టేబుల్ పైన ఉండే వస్తువులను ఫెంగ్‌షుయ్ ప్రకారం అమర్చుకోవడం ద్వారా పై అధికారుల మన్ననలు, ఉద్యోగపరంగా ప్రమోషన్లు వంటివి లభిస్తాయి.
మీరు తాగుతున్న టీ కప్పు లేదా కాఫీ కప్పు ఉత్తరం దిక్కున గల ప్రదేశంలో ఉంచండి. నిజానికి ఈ ప్రదేశంలో చిన్న ఆక్వేరియం లాంటిది (ద్రవపదార్థం కదలాడే ఆట వస్తువు లాంటిది పెడితే మంచిది) పెట్టడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
అదేవిధంగా పేపర్ వెయిట్ లాంటి గాజు లేదా సిరమిక్, క్రిస్టల్‌లను మీ టేబుల్‌కు ఈశాన్యం దిక్కున గల ప్రదేశంలో ఉంచండి. ఈ మధ్య క్రిస్టల్‌తో చేసిన చిన్న చిన్న దేవుడి విగ్రహాలు పెడితే పదోన్నతి, వృత్తిపరమైన అభివృద్ధి, మీలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం అంటోంది.
ఇక మీ టేబుల్‌కు తూర్పు దిక్కున గల ప్రదేశంలో తాజా పూలను పెట్టండి. అలా కుదరని పక్షంలో (టేబుల్ క్లాత్‌పై ఒక అద్దం లాంటిది పెడతారు కాబట్టి) దాని క్రిందుగా ఈ దిశలో పూలుండే చిన్న పటం పెట్టండి. ఇలా చేస్తే.. మీలో ఉత్సాహం, ప్రాజెక్టుల కైవసం వంటి తదితర శుభ ఫలితాలు చేకూరుతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే... ఆకుపచ్చ ఎక్కువగా గల పటాన్ని మీ టేబుల్‌కు ఆగ్నేయం దిశలోనూ, కంప్యూటర్, ఇతర వెలుగుజిమ్మే వస్తువులను దక్షిణ దిశగా పెట్టడం చాలా మంచిది. సాధ్యమైనంతవరకు మీ ఆఫీసులో ఎక్కడ పెట్టినా కంప్యూటర్ దక్షిణ దిశలోనే ఉండేటట్లు అమర్చుకోవడం ద్వారా సంస్థకు మంచి పేరు లభిస్తుందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.