సోనియా ఆస్తులు రూ.9.28 కోట్లు : సొంత కారు లేదు!
, బుధవారం, 2 ఏప్రియల్ 2014 (18:51 IST)
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. బుధవారం రాయ్ బరేలీ లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో మొత్తం ఆస్తుల విలువ రూ.9.28 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందులో మొత్తం చరాస్తుల విలువ 2.81 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ 6.47 కోట్లు. తన కుమారుడు రాహుల్ గాంధీకి అప్పుగా 9 లక్షల రూపాయలు ఇచ్చారు. చరాస్తుల్లో 85 వేల రూపాయలు నగదు ఉండగా, 66 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో ఉన్నట్టు పేర్కొన్నారు. 10
లక్షల రూపాయల విలువైన బాండ్లు, 1.90 లక్షల రూపాయల విలువై షేర్లు ఆమె పేరిట ఉన్నాయి. 2012-13 సంవత్సరానికి గాను ఆమె 14.21 లక్షల ఆదాయపు పన్ను చెల్లించారు. మ్యూచువల్ ఫండ్స్‌లో 82.20 లక్షలు, ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)లో 42.49 లక్షలు, జాతీయ పొదుపు పథకంలో 2.86 లక్షలు ఉన్నట్టు చూపారు. కాగా సోనియా వద్ద ఉన్న ఆభరణాల విలువ 62 లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. ఇటలీలో తనకున్న ఒక స్థలం విలువ 19.90 లక్షలు కాగా, మరొక స్థలం విలువ 4.86 లక్షలుగా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్ పూర్‌లో ఆమెకు 1.40 లక్షల రూపాయల విలువ చేసే స్థలం ఉంది. ఇవన్నీ కలిపి 9.28 కోట్ల రూపాయలని ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.