భోపాల్‌పై పట్టువీడని అద్వానీ.. బుజ్జగిస్తున్న బీజేపీ
, గురువారం, 20 మార్చి 2014 (11:54 IST)
బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీకి భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిటీ ఝులక్ ఇవ్వడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో పాటు.. సుష్మా స్వరాజ్‌లు గురువారం అద్వానీ నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఉన్న విభేదాల కారణంగా ఐదుసార్లు పోటీ చేసిన గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానానికి బదులుగా ఈసారి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి బరిలో దిగాలనుకున్న ఆయన ఆశలపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నీళ్లుచల్లింది. పార్టీలోని సీనియర్లకు కోరుకున్న చోట సీట్లు కేటాయిస్తున్న తరహాలో తనకు కూడా భోపాల్ సిటీ స్థానాన్ని కేటాయించాలన్న ఆయన డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మోడీ కోసం భోపాల్ స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధమని పార్టీ సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత కైలాశ్ జోషీ ప్రకటించినా బీజేపీ అధిష్టానం మాత్రం అద్వానీకి ఆ సీటును కేటాయించేందుకు ససేమిరా అంటోంది. అద్వానీ ఈసారి కూడా గాంధీనగర్ స్థానం నుంచే తిరిగి పోటీ చేయాలని కోరింది. దీనికి ఆయన ససేమిరా అంటున్నారు.