బీజేపీ మేనిఫెస్టో : శ్రీరామనవమి రోజున రాముడికి కానుక!
, సోమవారం, 7 ఏప్రియల్ 2014 (12:14 IST)
శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమికి భారతీయ జనతా పార్టీ సోమవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో చిరుకానుకను ప్రకటించింది. రాజ్యాంగానికి లోబడి రామాలయ నిర్మాణాన్ని చేపడుతామని మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే మైనారిటీల అభ్యున్నతికి తమ పార్టీ కృషి చేస్తుందని పేర్కొంది. దేశంలోని ఇతర వర్గాలతో పాటు.. ముస్లింలకు సమాన అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. 52 పేజీలున్న మేనిఫెస్టోని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీలు సోమవారం సంయుక్తంగా విడుదల చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బీజేపీ మేనిఫెస్టో ఉందని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో తయారీ కోసం మురళీ మనోహర్ జోషీ ఆధ్వర్యంలోని 17 మంది సభ్యులతో కూడిన కమిటీ పనిచేసింది. ఉపాధి కల్పనకు పెద్దపీట వేసింది. పోలీసుల, న్యాయ పరిపాలన విభాగాల్లో సంస్కరణలు చేపట్టనుంది. మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేయనుంది.అందరికీ ఆహార భద్రతే లక్ష్యంగా పని చేయనుంది. విదేశాల్లో నల్లధనం వెలికితీతకు ప్రత్యేక విభాగం, బ్రాండ్ ఇండియా రూపకల్పన, ప్రతి ఒక్కరికీ సాగు - తాగు నీరు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.