అమేథీలో అడ్రస్ లేని రాహుల్!.. షాకిచ్చిన సబ్ కలెక్టర్!
, గురువారం, 3 ఏప్రియల్ 2014 (16:23 IST)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అమేథీలో అడ్రస్ లేక పోవడంతో నివాస ధృవీకరణ కోసం తాను పెట్టుకున్న దరఖాస్తును అమేథీ సబ్ కలెక్టర్ తిరస్కరించి షాకిచ్చారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కాంగ్రెస్ యువరాజు తలపట్టుకున్నారు. నివాస ధృవీకరణ పత్రం కోసం రాహుల్ చేసుకున్న వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ తోసిపుచ్చారు. దీంతో అమేథీలో రాహుల్ బ్యాంకు ఖాతాను ప్రారంభించలేక పోయారు. అమేథిలో రాహుల్‌కు సొంత ఇల్లు లేదా బ్యాంకు ఖాతా లేదు. ఇది రాహుల్ గాంధీ ఎన్నికల వ్యయం చూపించే అంశంపై చిక్కు ఏర్పడింది. ఈ వ్యయాన్ని చూపాలంటే అమేథిలో ఖచ్చితంగా బ్యాంకు అకౌంట్ ఉండాలి. ఆ అకౌంటు నుంచే ఎన్నికల వ్యయాలకు సంబంధించిన లెక్కలు చూపించాల్సి ఉంటుంది. అమేథీలో బ్యాంకు ఖాతా తెరవడానికి నివాస ధ్రువీకరణ పత్రం అవసరమైంది. రాహుల్ దరఖాస్తు చేసుకున్నారు. కానీ అమేథికి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఆ ప్రాంతంలో నివాసం ఉండని కారణంతో సబ్ కలెక్టర్ రాహుల్ అభ్యర్థనను తిరస్కరించారు.