జైలుకెళ్లితే.. అక్కడే టీ స్టాల్ పెట్టుకుంటా : నరేంద్ర మోడీ
, మంగళవారం, 29 ఏప్రియల్ 2014 (11:51 IST)
గుజరాత్ రాష్ట్రంలో లోకాయుక్త ఉండివుంటే నరేంద్ర మోడీ జైలుకే వెళ్లి వుండేవారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ స్పందించారు. రాహుల్ కోర్కె మేరకు తాను జైలుకెళితో అక్కడే టీ స్టాల్ పెట్టుకుని చాయ్ అమ్ముకుంటానన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలీలో మంగళవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. తనకు అధికారం ఇచ్చి ఢిల్లీకి పంపాలని ఆయన గుజరాత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనను ఢిల్లీకి పంపడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను స్మరించుకోవాలని సూచించారు. ఒక వేళ తనను జైలుకి పంపితే, అక్కడే ఒక టీ స్టాల్ పెట్టుకుంటానన్నారు. రాహుల్ అబద్ధాలు చెబుతున్నారని, తమ రాష్ట్రంలో ఇప్పటికే లోకాయుక్త ఉందని గుర్తు చేశారు. తనని జైలుకు పంపడానికి కాంగ్రెస్ అన్ని యత్నాలు చేసి విఫలమైందని, ఒక వేళ జైలుకి పంపితే అందులో టీ స్టాల్ నడపడానికి సిద్ధమని నరేంద్ర మోడీ ప్రకటించారు.