సచిన్ వేల కోట్ల సంపాదనకు పీవీ కారణం... పవన్ కళ్యాణ్
, మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (19:16 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వేలకోట్లు ఆర్జించడానికి కారణం తెలంగాణ నుంచి దేశ ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహరావు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా నరేంద్ర మోడీ భాజపా ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడారు. సచిన్ వేల కోట్ల సంపాదన వెనక ఉన్న లెక్కను చెప్పుకొచ్చారు. అప్పట్లో పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగానే మల్టీ నేషనల్ కంపెనీలన్నీ సచిన్ వెనుక క్యూ కట్టాయని చెప్పారు. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపించిన పీవీని కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. అభివృద్ధి చేయడమంటే అదేదో కేవలం రింగురోడ్డులను నిర్మించి రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు దండుకోవడం కాదన్నారు. నీరు, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాల కల్పనే అభివృద్ధి అని చెప్పారు. ఇవన్నీ గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ చేసి చూపించారంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు.