మోడీకి రజనీకాంత్ మద్దతు.... తమిళనాడు ఈక్వేషన్స్ చేంజ్
, శనివారం, 12 ఏప్రియల్ 2014 (22:05 IST)
తమిళనాడులో ఏదో ఒక స్థానిక పార్టీ అండ లేకపోతే కాంగ్రెస్ లేదంటే భాజపా వంటి ఎంత పెద్ద జాతీయ పార్టీలైనా మట్టి కరుస్తాయి. తమిళ తంబీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువైపు చూడరు. తమిళనాడులో రెండు ప్రధాన ద్రవిడ పార్టీలయిన డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య పోటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈసారి మాత్రం 2014 ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలిచి తీరాలని చూస్తున్నాయి. అదే ఊపుతో రాష్ట్రంతోపాటు కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దాంతో కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడంలేదు.ఇదిలావుంటే సార్వత్రిక ఎన్నికలు 2014 నేపథ్యంలో భాజపా ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సినీ ప్రముఖుల మద్దతు రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. తమిళనాడు కోలీవుడ్ నుంచి దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు. ఆదివారంనాడు భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చెన్నైలో పర్యటించనున్న నేపధ్యంలో రజనీకాంత్ నివాసానికి స్వయంగా మోడీ వెళ్లి కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ అనంతరం రజినీ మీడియాకు ఏం చెపుతారూ... కోట్లలో ఉన్న రజినీ అభిమానులకు ఆయన ఇచ్చే సందేశమేమైనా ఉంటుందా అనే ఆసక్తి నెలకొని ఉంది.అసలు ప్రతీ ఎన్నికల సమయంలో హాట్ టాపిక్‌గా నిలిచే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈసారి కూడా తమిళనాట హాట్ టాపిక్‌గా మారారు. సహజంగా రాజకీయాలకు దూరంగా ఉండే రజనీని ఆదివారం మోడీ కలవనున్నారు. ఆదివారం చెన్నైలోని జరిగే బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు. ఎప్పుడూ ఏ పార్టీకి గానీ, నాయకుడికి గాని మద్దతు ఇవ్వని రజనీకాంత్ తాజాగా మోడీకి మద్దతిస్తున్నాడన్న వార్తలపై సర్వత్రా ఆసక్తినెలకొంది. ఇటీవల రజనీని కరుణానిధి కుమారుడు స్టాలిన్ కలిశారు. అదేవిధంగా డీఎమ్‌డీకే అధినేత విజయ్ కుమార్ కూడా కలిసినట్లు సమాచారం. కానీ ఎవరికీ ఆయన మద్దతు ప్రకటించలేదు. అయితే తాజాగా మోడీతో భేటీ వెనుక అసలు కారణాలేంటనేది తెలియరాలేదు. ఇప్పటికే మన రాష్ట్రం నుంచి సినీ హీరోలు పవన్ కల్యాణ్, నాగార్జునలు మోడీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.