పోలింగ్ ముందురోజు జైసపా కిరణ్ కు షాకింగ్స్... ముగ్గురు జారుడు...
, మంగళవారం, 6 మే 2014 (22:20 IST)
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ చప్పబడిపోయిందా...? ఆ పార్టీ అభ్యర్థుల్లో ధైర్యం పోయిందా...? ఎలాగూ గెలవలేం కనుక కనీసం చిట్టచివరికైనా కప్పదాటుడు చేసేద్దాం అనుకున్నారు. సీమాంధ్ర ప్రజల పల్స్ జై సమైక్యాంధ్ర అనడం లేదా...? ఈ ప్రశ్నలకు సమాధానాలుగా ఇపుడు ముగ్గురు జైసపా అభ్యర్థులు కనబడుతున్నారు. పోలింగుకు మరికొన్ని గంటలు ఉండగా జై సమైక్యాంధ్ర పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు(ఇప్పటివరకు అందిన సమచారం ప్రకారం) జారుకున్నారు. ఓట్లు చీలకూడదనే ఉద్దేశ్యంతోనే తప్పుకుంటున్నట్లు విశాఖ జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ అభ్యర్థి భీమునిశెట్టి ఆదిబాబు జైసపాకు గుడ్ బై చెప్పేశారు. అలాగే ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ జేఎస్పీ అభ్యర్థి శేషాద్రి నాయుడు కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతకుముందు విశాఖ లోక్ సభకు జేఎస్పీ తరపున పోటీ చేస్తున్న సబ్బం హరి కూడా వైకాపా గెలవకుండా ఉండాలంటే తను తప్పుకోవాల్సిందేనంటూ పోటీ నుంచి విరమించుకున్నారు. ఇలా సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా ముందుకు కదిలిన లీడర్లు చిట్టచివర్లో జావగారిపోయారు. యుద్ధానికి ముందే కత్తి, డాలు నేలపై విడిచి జారుకున్నారు. ప్రజల పల్స్ పట్టుకున్నారేమో...?