జగన్ మోహన్ రెడ్డిపై 22 కేసులు... అఫిడవిట్లో ఆస్తులు వెల్లడి
, శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (12:07 IST)
కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ గురువారంనాడు ఎన్నికల కమిషన్ అధికారుల వద్ద దాఖలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ లో పలు విషయాలను పేర్కొన్నారు. తనపై 22 కేసులు నమోదయి ఉన్నాయని ఆయన వెల్లడించారు. సిబిఐ కోర్టులో 2012 ఏప్రిల్ నెల నుండి ఈ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు జగన్ పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని సిబిఐ కేసులను విచారణ చేస్తోందని తెలిపారు.ఇంకా తన ఆస్తులు రూ. 416 కోట్లుగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ 416 కోట్ల రూపాయల ఆస్తుల్లో రూ. 344 కోట్లు తన పేరుపై ఉండగా మిగిలినవి అంటే, రూ. 72 కోట్లు తన భార్య భారతి పేరుపై ఉన్నాయని తెలిపారు. తనకు కనీసం సొంత వాహనం లేదని తెలిపారు. ఐకే 2011 ఉపఎన్నికల సందర్భంగా తన ఆస్తులను రూ. 445 కోట్లుగా చూపించిన జగన్ ఇప్పుడు తన ఆస్తులు రూ. 416 కోట్లుగా ఉన్నట్లు చూపించడంతో ఆయన ఆస్తి కొంతమేర కరిగిపోయిందని తెలుస్తోంది.