కాంగ్రెస్ సీట్ల కోసం సీమాంధ్రలో ఎగబడుతున్నారు... చిరంజీవి వ్యాఖ్య
, శనివారం, 12 ఏప్రియల్ 2014 (14:30 IST)
కేంద్రమంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి శనివారం మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో అధ్వాన్న పరిస్థితిలో ఉన్నదని అంటున్నారనీ, కాని అది వాస్తవం కాదన్నారు చిరంజీవి. అసెంబ్లీ, ఎంపీ, జట్పీటీసి, ఎంపీటిసి కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం సీమాంధ్రలో ఎగబడుతున్నారనీ, తమకు పుంఖానుపుంఖాలుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చిపడ్డాయని అన్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి ఎవరికి సీట్లు ఇవ్వాలన్నదానిపై తాము తలమునకలై ఉన్నట్లు తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ గడ్డుపరిస్థితిలో ఏమీ లేదనీ, చాలా బలంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి మాజీముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. కేవలం పార్టీని ఉపయోగించుకుని పదవులను అనుభవించి ఆ తర్వాత అవసరం తీరగానే పలాయనం చిత్తగించారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గురించి తనకు అంతగా అవగాహన లేదని వ్యాఖ్యానించారు.