500 కిలోల పూలతో రాహుల్ ర్యాలీ... అమేథిలో రాహుల్ నామినేషన్
, శనివారం, 12 ఏప్రియల్ 2014 (19:22 IST)
కాంగ్రెస్ పార్టీ యువరాజు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ అమేథిలో శనివారంనాడు 2014 ఎన్నికలు కోసం నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ వెంట ఆయన తల్లి సోనియా గాంధీతోపాటు సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. బావ రాబర్ట్ వాధ్రా కూడా వచ్చారు. అమేథి లోక్ సభ స్థానం నుంచి ఇప్పటికి 2 మార్లు విజయం సాధించిన రాహుల్ గాంధీ నామినేషన్ వేసేందుకు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు 500 కిలోల పూలతో పూల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీని, ఆయన కుటుంబాన్ని చూసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎగబడ్డారు. మరోవైవు రాహుల్ గాంధీకి అమేథీ స్థానంలో గట్టి పోటీ తప్పేట్లు లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అమేథిలో సోదరి ప్రియాంకను ప్రచారానికి దింపనుంది కాంగ్రెస్ పార్టీ. 2009లో ఉన్న వాతావరణం అమేథీలో లేకపోవడంతో కనీసం కొద్ది మెజార్టీతోనైనా గట్టెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.