పవన్ చెప్పినట్లు చేస్తా... పీవీపికి బాబు మొండిచెయ్యి
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (14:54 IST)
పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీకి కారకుడైన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) రాజకీయ భవితవ్యం ఏమిటో చర్చనీయాంశంగా మారింది. పవన్ ఉన్నాడన్న ధైర్యంతో విజయవాడ ఎం.పి. సీటును తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించి భంగపడ్డాడు. గతంలో జగన్‌కు అనుకూలంగా ఉండి బయటకు వచ్చిన తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్‌ను కలవడం... పవన్ చంద్రబాబు నాయుడ్ని కలవడం వంటి నాటకీయ పరిణామాలు జరిగాయి. రకరకాల కారణాల వల్ల పీవీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అందుకు ఆయన 5 వేలతో ఓటును కొంటానంటూ చెప్పారన్న మాటలు పెద్ద చర్చనీయాంశంగా మారడంతోపాటు... నాన్‌లోకల్ అభ్యర్థి కావడంతో ఆయనకు విజయవాడ సీటు రాకుండా చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బిజెపి తరపున కర్నాటకలో ప్రచారం చేస్తున్నాడు. కాగా, ప్రస్తుతం పీవీపీ తన భవిష్యత్ కార్యాచరణపై బుధవారంనాడు ప్రకటన చేశారు. ''
రేపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌గారితో చర్చించిన అనంతరం.. నా భవిష్యత్ కార్యాచరణ గురించి తెలియపరుస్తాను. అలాగే పవన్‌గారు చెప్పిన విధంగానే ఆయన బాటలోనే నడుస్తాను..'' అంటూ ప్రకటన వెలువరించారు. మరి పవన్ కళ్యాణ్ ఏమని చెపుతాడో... పీవీపి ఏం చేస్తాడో వెయిట్ అండ్ సీ.