నన్ను నమ్మండి.. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తా : చిరంజీవి
, మంగళవారం, 6 మే 2014 (09:30 IST)
నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. సీమాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని కేంద్ర మంత్రి చిరంజీవి హామీ ఇచ్చారు. ఆయన సోమవారం ఆత్మకూరులో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు అందించినన్ని సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అందించలేదన్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా హామీ ఇచ్చారన్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో కూడా ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, మళ్లీ ఆనం రామనారాయణ రెడ్డిని శాసనసభ్యునిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు.